రైతులు దేశానికి వెన్నుముక

రైతులు దేశానికి వెన్నుముక

ఎన్డీయే ప్రభుత్వంలో రైతులకు అత్యధిక ప్రాధాన్యత

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హోం మంత్రి అనిత

యస్ రాయవరం, డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్

రైతన్న మీకోసం–రైతు వారోత్సవాలలో భాగంగా హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం యస్ రాయవరం మండలంలోని గుడివాడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొని వారి సమస్యలు, అవసరాలు, సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా అధికారులతో మంత్రి అనిత చర్చించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారులు హోం మంత్రిని ఘనంగా సన్మానించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముకని పేర్కొన్నారు. రైతులకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వాలి అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, 24 గంటల్లో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు.రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే ఏడాదిలో కనీసం 50 శాతం సేంద్రీయ వ్యవసాయం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.తమలపాకుల రైతులకు అధికంగా నష్టపరిహారం అందజేశామని గుర్తు చేశారు.తరువాత బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మదర్ థెరిస్సా మహిళా సహకార సంఘ సభ్యులకు రూ. 2,54,000 చెక్కును హోం మంత్రి అనిత అందజేశారు.