
రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం, జూలై 10:అనంత జనశక్తి న్యూస్
రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదని, దానిని పండుగగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. గత తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా ఈ సభ నిర్వహించారు.సభా వేదికపై రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009.15 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి, రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు.
30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.70 లక్షల కోట్లు
గత 30 నెలల కాలంలో రైతులు రాజుల్లా జీవించాలన్న సంకల్పంతో వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. రైతు భరోసా కింద మాత్రమే రూ.36,135 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.“ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు” అని పెద్దలు చెప్పారని గుర్తుచేసిన ఆయన, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి భారీ ప్రాధాన్యం
రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, ఉచిత విద్యుత్, పంట నష్టపరిహారం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా సగటున రూ.5,500 కోట్ల మేర రైతు సంక్షేమానికి వెచ్చిస్తోందని సీఎం తెలిపారు.
అలాగే, మొక్కజొన్న రైతుల కోసం రూ.3,504 కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు.
సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.8.11 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కొత్త కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పాటు ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.అదేవిధంగా మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు అందించడం, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్ల రుణాలు కల్పించడం, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం, ఏడాదిలోగా 67,717 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు.
తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగనివ్వబోమని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







