
కర్ణాటక వాసి హత్య కేసు ఛేదింపు
భూమి వివాదాలు, అవమాన పగతోనే హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్
నేరస్తులను ఎక్కడున్నా వదిలిపెట్టం – జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్
పుట్టపర్తి డిసెంబర్ 13, అనంత జనశక్తి న్యూస్
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముత్తప్ప అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భూమి వివాదాలు, గతంలో జరిగిన అవమానంతో ఏర్పడిన పగ కారణంగానే ఈ హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.అమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 04-09-2025 న నమోదైన Cr.No.41/2025 U/s 103 BNS r/w 3(5) BNS హత్య కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ , ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టించారు.03-09-2025 రాత్రి టమోటా పొలంలో పని నిమిత్తం అక్కడే ఉన్న ముత్తప్ప, మరుసటి రోజు ఉదయం అమడగూరు మండలం ఆకులవారిపల్లి శివారులోని పెద్దవంక ఒడ్డున తలపై, మెడపై తీవ్ర గాయాలతో హత్య చేయబడిన స్థితిలో కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల విచారణలో, నిందితుడు A1కు మృతుడితో భూమి వివాదాలు ఉండగా, నిందితుడు A2 గతంలో మృతుడి అన్న కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీనిపై మృతుడు చెప్పుతో కొట్టించి అవమానపరచాడన్న పగతో నిందితులు మృతుడిపై కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో A3తో కలిసి సుమారు ఆరు నెలలుగా హత్యకు పథకం వేసి, 03-09-2025 రాత్రి 8.30 గంటల సమయంలో ఇనుప రాడ్లతో దాడి చేసి ముత్తప్పను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.ఈ కేసులో నిందితులైన K. సురేష్ (54), R. సోమశేఖర (36), A. ఆనంద (42) లను 14-12-2025 ఉదయం 6.30 గంటలకు ఓ.డి. చెరువు మండలం మహమ్మదాబాద్ వద్ద అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరాలకు పాల్పడిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు తమ ఇళ్ల వద్ద, షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మీడియా సమావేశంలో డిఎస్పి విజయ్ కుమార్, నల్లమాడ సిఐ వై. నరేంద్ర రెడ్డి, ఎస్బిసిఐ వెంకటేశ్వర్లు, డిటిఆర్బి సిఐ శ్రీనివాసులు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.








