టిడిపి ప్రభుత్వం ఉంటేనే చెరువులకు నీరు వస్తుంది

టిడిపి ప్రభుత్వం ఉంటేనే చెరువులకు నీరు వస్తుంది

కక్కలపల్లి చెరువు కృష్ణా జలాలతో నిండిన సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత

చెరువు నిండటంతో గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఆనందం

మంత్రి సునీతకు ఘనస్వాగతం.. చెరువు వద్ద గంగపూజ, జలహారతి

గంగమ్మకు బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే సునీత

గత ఐదేళ్లలో నీరు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదన్న సునీత

రాప్తాడు డిసెంబర్ 14 , అనంత జనశక్తి న్యూస్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే చెరువులకు నీరు వస్తుందని, రైతులు సంతోషంగా ఉంటారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి చెరువుకు కృష్ణా జలాలు చేరి, మరువ పారుతున్న సందర్భంగా ఆమె గ్రామానికి వచ్చారు. ముందుగా పరిటాల సునీతకు గ్రామస్తులు, స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి బోనాలు ఎత్తుకొని చెరువు వరకు ప్రదర్శన నిర్వహించారు. మహిళలతో కలిసి చెరువు వద్ద గంగమ్మకు బోనాలు సమర్పించి, గంగపూజ, జలహారతి నిర్వహించారు. మరువ పారుతున్న చెరువును చూసి గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోజు నీరు-చెట్టు పథకం కింద తోపుదుర్తి నుంచి బుక్కచెర్ల వరకు కాలువ తవ్వామన్నారు. ఆరోజు బిల్లులు రాకపోయినా.. ఈరోజు నీరు రావడం సంతోషంగా ఉందన్నారు. వాస్తవంగా పీఏబీఆర్ నుంచి ఈ చెరువుకు నీరు వచ్చేదని.. అయితే ప్రతి ఏటా ఆలస్యం జరుగుతున్నందున హంద్రీనీవా ద్వారా నీరు అందించాలని తోపుదుర్తి నుంచి బుక్కచెర్ల వరకు కాలువ తవ్వినట్లు చెప్పారు. ఇప్పుడు బుక్కచెర్ల, కాట్నే కాలువ, కక్కలపల్లి చెరువులకు నీరు చేరిందన్నారు. ఈ నీరు రావడానికి గ్రామంలో కొందరు చాలా కష్టపడ్డారని అన్నారు. పిఏబీఆర్ ద్వారా మరికొన్ని చెరువులకు నీరు అందాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు అందించామన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఏ రోజు కూడా నీరు అందించాలన్న ఆలోచన కూడా చేయలేదని విమర్శలు చేశారు. కేవలం వర్షాధారంగా వచ్చిన నీరు తప్ప వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని చెరువులకు నీరు అందించిన పాపాన పోలేదన్నారు. త్వరలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రామగిరి ప్రాంతానికి కూడా నీరు ఇస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు…..