రైతే రాజు లక్ష్యం…

రైతే రాజు లక్ష్యం…

సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం

సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 19 అనంత జనశక్తి న్యూస్

ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో సాదా బైనామా భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు.భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతి లో నిర్వహించిన పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.ఈ నెల 22న రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సీఎం, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.“ధరణి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలుస్తూ భూ భారతి ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామా భూముల అంశాన్ని త్వరలోనే క్లియర్ చేస్తాం” అని తెలిపారు.రైతుల సంక్షోభాన్ని అధిగమించేందుకు పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామని, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు.రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ. 18 వేల కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.వ్యవసాయమే రాష్ట్రానికి మూలాధారం అని, రైతులు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగ శ్రవణం చేయగా, వివిధ ఆలయాల అర్చకులను ముఖ్యమంత్రి సత్కరించారు.