అర్ధరాత్రి అనంతలో ఎస్పీ దాడులు

అర్ధరాత్రి అనంతలో ఎస్పీ దాడులు – డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు

“ఆపరేషన్ నైట్ సేఫ్టీ”తో నగరంలో భద్రత కట్టుదిట్టం – 125 కేసులు నమోదు

రాత్రి వేళల్లో పోలీసుల అలర్ట్ – మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన శిక్షలు

అనంతపురం క్రైం ఏప్రిల్ 12,అనంత జనశక్తి న్యూస్

జిల్లా వ్యాప్తంగా రాత్రి భద్రతను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పి. జగదీష్ అర్ధరాత్రి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కీలక ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్ కూడలి, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 12:30 గంటల సమయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ 34 కేసులు నమోదు చేయగా, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించిన 91 మందిపై కేసులు నమోదు చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్పీ , ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హెచ్చరించారు.రాత్రివేళ అనవసరంగా సంచరిస్తున్న వ్యక్తులను ఆపి విచారించి, వారి వివరాలను నమోదు చేశారు.అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.నగరంలో ప్రజలు భయపడకుండా సురక్షితంగా సంచరించేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, అవసరం ఉన్నవారు మాత్రమే రాత్రి సమయంలో బయటకు రావాలని సూచించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, బీట్ కానిస్టేబుళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాత్రి వేళల్లో బందోబస్తు మరింత బలపరచాలని తెలిపారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని, అనవసరంగా తిరుగుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయాలని సూచించారు.నగరంలో నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజలకు విజ్ఞప్తి: అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.