జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా కొరకు పటిష్టంగా ముందస్తు చర్యలు చేపట్టాలి

జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా కొరకు పటిష్టంగా ముందస్తు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్

పుట్టపర్తి, నవంబర్ 6:అనంత జనశక్తి న్యూస్

జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం ప్రత్యేక పునఃపరిశీలనకు (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) పటిష్టమైన ముందస్తు కార్యక్రమాలు చేపట్టి పూర్తిస్థాయి సిద్ధతతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను అందజేశారు.స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్, సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.“గతంలో 2002లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃపరిశీలన జరిగింది. సుమారు 23 సంవత్సరాల తరువాత ఎన్నికల సంఘం మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది. అందుకు సంబంధించి జిల్లాలో అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి,” అని పేర్కొన్నారు.బిఎల్ఓలు (బూత్ లెవల్ ఆఫీసర్లు) ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల జాబితాను సక్రమంగా తయారు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ ప్రత్యేక పునఃపరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి వారి జాబితాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారులకు వెంటనే సమర్పించేలా చూడాలని తెలిపారు. అలాగే ఎన్నికల సిబ్బందిలో ఖాళీలు ఉన్న చోట కొత్త వారిని నియమించి స్థానాలు భర్తీ చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో సూర్యనారాయణ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.