
పత్తి రైతుల ఇబ్బందులు నివారించాలంటూ కేంద్రాన్ని కోరిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నవంబర్ 6:అనంత జనశక్తి న్యూస్
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాల మరియు మత్స్యశాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర నూలు పరిశ్రమల మంత్రివర్యులు గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు.2025–26 ఖరీఫ్ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 56 వేల హెక్టార్లలో పత్తి సాగు జరిగి, 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని మంత్రి తెలిపారు. అయితే మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తిని అమ్మకానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి యాప్ ద్వారా రైతు వివరాలను ఆధార్ ఆధారంగా నమోదు చేసి, పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నదని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పత్తి రైతు యాప్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.రైతుల సౌకర్యార్థం కేంద్రం తీసుకోవలసిన చర్యలు ,పత్తి రైతు యాప్ నుండి ముఖ్యమంత్రి యాప్‌కు రైతు వివరాలు తక్షణమే సమన్వయం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్దే పత్తిని విక్రయించుకునేలా సదుపాయం కల్పించాలి. స్థాయి–1, స్థాయి–2, స్థాయి–3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చూడాలి.పత్తి రైతు యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల పరిష్కారానికి గుంటూరులో ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. వాతావరణ ప్రభావంతో తేమ శాతం 12 నుండి 18 శాతం వరకు ఉన్న పత్తిని తగిన తగ్గింపులతో కొనుగోలు చేయాలి.వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలి.ఈ చర్యలు రైతుల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించి, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారం అందించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.








