జిల్లాలో భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లాలో భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడ

ఒరిస్సా ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరిపిన మంత్రి అచ్చెన్నాయుడు

ముందస్తు చర్యలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం

నిమ్మాడ,అక్టోబర్ 2 అనంత జనశక్తి న్యూస్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి లతో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని మంత్రి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు మంత్రి సూచించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పని చేసి వర్షాల ప్రభావాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే నివేదించాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఒరిస్సా ప్రభుత్వ ఉన్నత అధికారులతో కూడా మంత్రి అచ్చెన్నాయుడు సంప్రదింపులు జరిపారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గాల శాసనసభ్యులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.