అరణ్యారామానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అరణ్యారామానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ

రూ.24 కోట్లతో అటవీ పరిశోధన, శిక్షణ కేంద్రం నిర్మాణం

విజయవాడ జూన్ 19, అనంత జనశక్తి న్యూస్

మంగళగిరి సమీపంలోని బ్రహ్మానందపురంలో నిర్మించనున్న ‘అరణ్యారామం’ భవన ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కేంద్రంగా సేవలు అందించనుంది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు సమన్వయ కేంద్రంగా ‘అరణ్యారామం’

అరణ్యారామం అటవీ పరిశోధన, శిక్షణ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలవడంతో పాటు H.A.N.U.M.A.N. కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా, ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా పనిచేయనుంది. పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన తదితర కార్యక్రమాల సమన్వయానికి ఈ కేంద్రం ఉపయోగపడనుంది. అనంతరం పవన్ కళ్యాణ్ అరణ్యారామం నమూనాను పరిశీలించి, వన్యప్రాణి రక్షణ చర్యలకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. 2024లో అటవీ శాఖ 185 వన్యప్రాణి రక్షణ చర్యలు, 36 మానవ–వన్యప్రాణి ఘర్షణ నివారణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వివరించారు.