
నందనవనానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్
పర్యావరణ పునరుద్దరణ దిశగా అడుగులు వేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు
మైనింగ్ తో క్షీణించిన అడవుల పునఃస్థాపన దిశగా అడుగులు
విజయవాడ జూన్ 19 అనంత జనశక్తి న్యూస్
అటవీ, పర్యావరణ శాఖల పరిపాలన, పర్యవేక్షణ కార్యాలయం అరణ్యారామానికి భూమి పూజ చేసిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నందనవనం పేరిట మైనింగ్ తో పర్యావరణ విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రకృతికి పునరుజ్జీవం పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వాళీ మర్రి మొక్కను నాటి నందనవనానికి తిరిగి ప్రాణం పోశారు. 2013 నుంచి ఆ ప్రాంతంలో చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలు సహజ సిద్ధమైన కొండ భాగం, అటవీ భాగం తీవ్రంగా క్షీణించింది. విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రకృతిని పునరుజ్జీవింప చేసే బృహత్తర కార్యక్రమాన్న పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. మైనింగ్ కారణంగా క్షీణించిన అటవీ భాగంలో పచ్చదనాన్ని పునఃస్థాపన దిశగా చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమంగా నందనవనం నిలువనుంది. అక్రమ మైనింగ్ తో ధ్వంసం అయిన ఈ ప్రాంతం మొత్తం మొక్కలతో నిండి “నందనవనం”గా రూపాంతరం చెందాలన్న సంకల్పంతో మర్రి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ ద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, వనరులతో కూడిన వాతారణాన్ని అందించాలన్న లక్ష్యంతో నందనవనం కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, అటవీ శాఖ పీసీసీఎఫ్ పి వి చలపతి రావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, అటవీశాఖ ఐటీ సలహాదారు పి.నాగబాబు, APCOST మెంబర్ సెక్రటరీ శరత్ , అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీమతి రేవతి, రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








