రైతులు పిలిస్తే పలికే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలి

రైతులు పిలిస్తే పలికే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలి

గత ఐదేళ్లు రైతులు చాలా నష్టపోయారు.. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు

రైతన్నా-మీ కోసం వర్క్ షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత

చీనీ పంట తెగుళ్లపై అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలన్న సునీత

రైతుల కోసం వచ్చే ఖరీఫ్, రబీ సీజన్ల ప్రణాళిక ఉంటుందన్న ఎమ్మెల్యే

రాప్తాడు డిసెంబర్ 03, అనంత జనశక్తి న్యూస్

రైతులు పిలిస్తే పలికే విధంగా వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామంలో ఆమె రైతన్నా-మీకోసం వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద వర్క్ షాప్ నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం గత ఏడాదిన్నరగా అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఇప్పటి వరకు ఎంత సాయం అందిదన్నది వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు పంచ సూత్రాలపై అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ మీ ప్రాంతంలో రైతు పంటల సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఏ పంట వస్తే ఎంత లాభం వచ్చింది.. నష్టం జరిగితే ఎంత మేర ఉంది.. ఇలాంటి అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. రైతుల చెప్పే అంశాలను బట్టి వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారన్నారు. వచ్చే ఐదేళ్లలో రైతు రాజుగా ఉండాలని.. ఎక్కడా నష్టపోకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే లక్ష్యమన్నారు. చీనీ పంటకు తెగుళ్లు వచ్చి.. తొలిగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏదైనా వైరస్ ప్రారంభ సమయంలోనే అధికారులు, శాస్త్రవేత్తలు తగిన సూచనలు చేస్తే ఇలా నష్టం జరిగే అవకాశం ఉండదన్నారు. గత ఏడాది టమోట పంట ఎక్కువ మంది రైతులు సాగు చేయడం వలన గిట్టుబాటు ధరలు దక్కక నష్టపోయారన్నారు. ఇప్పుడు పంట ఎక్కువగా ఉండటం వలన ధరలు పలుకుతున్నాయన్నారు. ఈసారి అరటికి కూడా ధరలు లేకపోవడం బాధాకరమని.. రైతులు పంటలు సాగు చేసే ముందే ఒక ప్రణాళిక ఉండాలన్నారు. అధికారులు కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఒక పంట సాగు చేస్తే.. దిగుబడి సమయానికి ధరలు ఎలా ఉండొచ్చన్నది కూడా రైతులకు తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి విధానం లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పుడు అధికారుల వైపు నుంచి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. రైతులు తమ ఆలోచనలు పంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే సునీత అభిప్రాయపడ్డారు…