
రైతులు క్లస్టర్ విధానం అవలంబించాలి – పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావుపేట,నవంబరు 22. అనంత జనశక్తి న్యూస్
జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు.స్థానిక కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతు ఉత్పాదక సంఘాల రైతులకు మునగ విత్తనాలను కలెక్టర్ కృతికా శుక్లా మరియు జాయింట్ కలెక్టర్ సూరజ్ లు అందజేశారు.కలెక్టర్ కృతికా శుక్లా రైతు ఉత్పాదక సంఘాలలోని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పంట ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకూ అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు.రైతు ఉత్పాదక సంఘాల రైతులకు మునగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి, సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని, పది కాలాల పాటు రైతులకు ఆదాయాన్నిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జగ్గారావు,ఏ పి డి రాజా ప్రతాప్,డి పి ఎం డేవిడ్ , మునగ రైతులు పాల్గొన్నారు.








