
లేపాక్షిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
మంత్రి కందుల దుర్గేష్
లేపాక్షికి యునెస్కో శాశ్వత గుర్తింపునకు చర్యలు తీసుకుంటామని, త్వరలో లేపాక్షి ఉత్సవాలు జరుపుతామని వెల్లడి
పుట్టపర్తి, లేపాక్షి, కదిరిలోని ప్రఖ్యాత ఆలయాలను టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని హామీ
16 నెలల కాలంలో పర్యాటక రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని స్పష్టం
లేపాక్షి నవంబర్ 20, అనంత జనశక్తి న్యూస్
లేపాక్షిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని,యునెస్కో గుర్తింపును శాశ్వతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రక లేపాక్షి క్షేత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా కొలువై ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుత కళా, శిల్ప సంపదతో అలరారుతోన్న లేపాక్షి క్షేత్రం యునెస్కో తాత్కాలిక వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుందన్నారు. ఇక్కడ దాదాపు 450 -500 ఏళ్ల క్రింద నిర్మించిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆలయం అణువణువులోనూ అద్భుత గాధ ఇమిడి ఉందన్నారు.పురాణ, ఇతిహాసాలను తెలియజెప్పే విధంగా నాటి శిల్పకళా నైపుణ్యంతో చెక్కిన శిల్ప సౌందర్యం అందరికీ అద్భుత అనుభూతిని కల్పిస్తుందన్నారు. ఇలాంటి ప్రాంతాలను కేవలం సందర్శించడమే కాదు అనుభూతిని ఆస్వాదించే స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పుట్టపర్తి సత్యసాయిబాబ నిలయంతో పాటు స్థానికంగా ఉండే ప్రకృతి సౌందర్య ప్రదేశాలనన్నింటిని కలిపి టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఒకరోజు దర్శనానికి వచ్చే పర్యాటకుడు రెండు మూడు రోజులు ఉండేలా చేయాలన్నదే పర్యాటక శాఖ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో పర్యాటకులకు వసతి కల్పనకు హోటల్స్, రిసార్ట్స్ ను పీపీపీ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. పలు పర్యాటక ప్రాంతాల్లో ఎకో, టెంపుల్, హెలీ, అగ్రి,అడ్వెంచర్ తదితర విభిన్న టూరిజం ప్రక్రియలను అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన సీఐఐ సమ్మిట్ లో రూ.17 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించామని, గడిచిన 15 నెలల కాలంలో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగంలోనే దాదాపు రూ.30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఏపీని పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామన్నారు.భారతీయ శిల్పకళా వైభవానికి, విజయనగర సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యానికి లేపాక్షి క్షేత్రం నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియాతో ముఖాముఖిలో తెలిపారు. ప్రధానంగా ఆలయ ప్రాంగణంలోని అద్భుతమైన ఏకశిలా నంది విగ్రహం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాలిలో వేలాడే స్తంభం,ఆలయ పైకప్పుపై వేసిన అపురూపమైన కుడ్య చిత్రాలు మన పూర్వీకుల గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని, కళాత్మక వారసత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయని పేర్కొన్నారు. ఈ విలువైన చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏటా రూ.7 కోట్ల రెవెన్యూ ఇచ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండ లాంటి రాజప్రాసాదాన్ని కట్టి పర్యాటక శాఖ రాబడిని దెబ్బతీశారన్నారు. పైపెచ్చు తాము అదనంగా ఏటా కోటి రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ క్రమంలో పీపీపీ విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసి ఆదాయాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. అదే క్రమంలో యువతకు ఉపాధి కల్పనకు చొరవ తీసుకుంటున్నామన్నారు.గడిచిన ఐదేళ్లలోని ప్రభుత్వం లేపాక్షి ఉత్సవాలను జరపలేదని తాము త్వరలోనే లేపాక్షి ఉత్సవాలను జరుపుతామన్నారు. ఇప్పటికే తాము పర్యాటకులను ఆకర్షించేలా ఫ్లెమింగో ఫెస్టివల్,అరకు బెలూన్ ఫెస్టివల్, బీచ్ ఉత్సవాలు, విజయవాడలో దసరా ఉత్సవాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబ శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వలమైన భవిష్యత్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.








