
నవరాత్రులు…. నవ అవతారాలు.
వివిధ రూపాలలో అమ్మవారి దర్శనం.
ఒక్కొక్క పేరుతో….ఒక్కొక్క రోజు… ఒక్కొక్క అవతారం.
తొమ్మిది రోజులు… 9 అవతారాలు…
నవరాత్రులలో చివరి రోజు నవదుర్గమాతగా దర్శనం.
అనంత జనశక్తి పాఠకులకు… అభిమానులకు… శ్రేయోభిలాషులకు నవరాత్రుల శుభాకాంక్షల తో పాటు అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ….
నవరాత్రుల కథ అంటే దేవీ నవరాత్రుల కథ, ఈ పండుగలో అమ్మవారు 9 రూపాయలైనా నవదుర్గలను ఆరాధిస్తారు. ఇది 9 రాత్రుల పాటు జరుపుకునే వార్షిక హిందూ పండుగ, ముఖ్యంగా దసరా సమయంలో జరుపుకుంటారు. ఈ కథనం నవరాత్రులలో అమ్మవారి ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రాముఖ్యతను, వారిని ఎలా పూజించాలి అనే వివరాలను తెలియజేస్తుంది. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిని, చంద్ర ఘంట, కుష్మాండా, స్కందమాత, కాళరాత్రి, కాత్యాయిని, మహా గౌరీ, మరియు సిద్ధి ధాత్రి ఈ విధమైన రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతిరోజు ఒక దేవత రూపానికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పండగ దుర్గాదేవి యొక్క శక్తిని, విజయాన్ని స్మరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రులను దసరా నవరాత్రులుగా జరుపుకుంటారు. తల్లి నిజంగానే చల్లని తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి. సరస్వతి, పార్వతి దేవికే మూలమైన తల్లి. ఆ తల్లికి భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానము, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు అన్ని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ముఖ్యంగా అశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే. ఈ క్రమంలో దేవీ నవరాత్రులు వేళ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాద నైవేద్యాలను సమర్పిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అదే దసరా పండుగ లేదా దసరా నవరాత్రులు ఈ ఏడాది సెప్టెంబర్ 22 (2025) నుంచి సంబరాలు ప్రారంభమైనవి. దేవీ నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి, శ్రీ శైల క్షేత్రం, నందవరం మరియు అమ్మవారు వెలిసిన వివిధ దేవాలయాలలో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
సత్యసాయి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 26, అనంత జనశక్తి న్యూస్:
“దేవీ నవరాత్రుల” ప్రాముఖ్యత ఏమిటి? అమ్మవారికి 9 రోజులు… 9 రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏమిటి? ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధి పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్లి శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ రుతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధి పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా 9 రూపాల తో నవరాత్రులలో అమ్మవారు నవరూపాలలో కనిపిస్తారు. ఆమెను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఈ అవతారాల గురించి తెలుసుకుందాం!
శైలపుత్రి:
దుర్గ శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకరణగా “బాలచంద్ర రేఖ”ను ధరించి ప్రతి శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి. ఆరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్పిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
రూపం: శ్రీ స్వర్ణ కవచాలంక్రత దుర్గాదేవి.
బ్రహ్మచారిణి :
దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరొక పేరు ఉంది. ఈ మాటను ఉపాసించే వారికి సర్వత్ర సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
రూపం: త్రిపుర సుందరీ దేవి.
చంద్ర ఘంట:
అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్థాకృతలో ఉండటంవల్ల ఆమెకు చంద్ర ఘంట అనే పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయ ఘంట మ్రోగుతూ ఉంటుంది.
రూపం: శ్రీ గాయత్రీ దేవి.
కుష్మాండ:
నాల్గవ స్వరూప నామం కుష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఆమె తేజోమయి. 8 భుజాలతో విరజిల్లు తుండటం వల్ల ఆమెను” అష్టభుజ దేవి”అని కూడా అంటారు.
రూపం: శ్రీ అన్నపూర్ణాదేవి.
స్కందమాత:
ఐదవ అవతారం స్కందమాత. స్కందూడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మం తో శోబిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందనటానికి సంకేతమే ఇది.
రూపం: శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి.
కాత్యాయని:
దుర్గామాత ఆరవ రూపం కాత్యాయిని. “కోత్స”అనే ఋషి తనకు పార్వతీ మాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతని కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయిని అనే పేరు వచ్చింది. మనిషాసురున్ని వధించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయిని మహర్షి పూజిస్తారు. ఈమె అశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిధుల్లో పూజలు అందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధిస్తుంది.
రూపం: శ్రీ మహాలక్ష్మి దేవి.
కాళ రాత్రి:
దుర్గామాత ఏడవ రూపం కాల రాత్రి. ఈమె శరీర ఛాయా చీకటి వలె నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాల రాత్రి అనే పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభం కరి అని కూడా పిలుస్తారు.
రూపం: మహా సరస్వతి దేవి.
మహా గౌరీ:
ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఆమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దానివలన ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహా గౌరిగా ప్రసిద్ధికెక్కింది.
రూపం: శ్రీ దుర్గాదేవి.
సిద్ధి ధాత్రి:
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధి ధాత్రి. ఈమె అన్ని సిద్దు లను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధు లను ఈ దేవి కృపతో పొందడానికి దేవి పురాణాలు చదివి, వినాలని చెబుతున్నాయి.
రూపం: శ్రీ రాజరాజేశ్వరి.
ఆయుధ పూజ:
పూర్వం పాండవులు సమీ వృక్షము పైన తమ ఆయుధాలను దాచి, అజ్ఞాతవాసము చేసినారు. వర్రీ అజ్ఞాత వాసము అర్జునుడు సమీ వృక్షము పైనుండి తన గాంధీవమును దించి కౌరవులతో యుద్ధం చేయటంతో ముగిసింది. విజయదశమి నాడు వారి అజ్ఞాతవాసం యొక్క గడువు ముగిసింది. కనుక ఆయుధ పూజ రోజున సమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాజులకు ఈ నవమినాడు తమ ఆయుధములను పూజించు పద్ధతి యే నేటికీ ఆయుధ పూజగా చేయబడు చున్నది. ఆ ఆయుధములతో పాటు చిత్ర చామరములు రాజ లాంచనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వం వాహనము లను లేదా తాను పనిచేయు యంత్రము లను పూజించవలెను. అందుకే విజయదశమి ముందు రోజున ప్రతి ఒక్కరూ తమకి ఉన్న వాహనాలను పూజించు కుంటారని, అది పురాణం నుంచి వస్తున్న ఆచారం కనుక ఆయుధ పూజలను ప్రతి ఒక్కరూ నిర్వహిస్తారు. మరొక్కసారి “అనంత జనశక్తి” పాఠకులకు, అభిమానులకు శ్రేయోభిలాషులకు నవరాత్రుల శుభాకాంక్షలు.








