శ్రీ మహా చండీ దేవిగా అమ్మలగన్నయమ్మ..

శ్రీ మహా చండీ దేవిగా అమ్మలగన్నయమ్మ..

చండీదేవి అలంకారం విశిష్ఠత

కనక దుర్గమ్మ శ్రీ మహా చండీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణేతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు2 వరకూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ.

చండీ ఎలా అవతరించింది…

చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు. హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం..రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అలా మాతృ దేవత అనుగ్రహంతో సరస్వతి దేవి, లక్ష్మీదేవి, మహాకాళి… చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీ దేవి ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తర్వాత చండీ దేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్‌లో ఉన్న చండీ దేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య రూపొందించారని చెబుతారు. నవరాత్రుల తొమ్మిది రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

చండీ పూజ ఎలా చేస్తారు…

చండీ దేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజు ఆవు పేడ, మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి, బియ్యంతో నిండిన మట్టి మూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. వేదమంత్రాలు చదువుతూ అదే కలశంలో కుండల నుంచి నీటిని చిలకరించి అమ్మవారిని ఆవాహనం చేస్తారు. పూజ మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల ఈ కాలంలో వేద పండితులు కేవలం పండ్లు మాత్రమే తింటారు. చండీ దేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తర్వాత హోమాన్ని కలశం ముందు నిర్వహిస్తారు.

చండికా మంత్రం ఇదే

ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే

శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా

ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ క్రీం శ్రీం స్వాహా

ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం, ఆరోగ్యం పొందుతారని పండితులు చెబుతారు.