
మూసీ ప్రాజెక్టుపై వెనకడుగు లేదు
అభివృద్ధికి అడ్డొస్తే కఠిన చర్యలు
గాంధీ విగ్రహానికి 5 వేల కోట్లు అన్నది అబద్ధం – కేవలం 70 కోట్లే: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చి 09, అనంత జనశక్తి న్యూస్
హైదరాబాద్ అభివృద్ధి కోసం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీ విగ్రహ నిర్మాణానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు సుమారు 70 కోట్ల రూపాయలే ఖర్చవుతాయని వివరించారు.దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో నదీ తీరాల అభివృద్ధికి మద్దతు ఇస్తున్న వారు, హైదరాబాద్‌లో మూసీ నది అభివృద్ధిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనతో నగర రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.పేదల జీవితాలతో రాజకీయాలు చేయకూడదని సీఎం అన్నారు. నగరాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని జర్నలిస్టులను కోరారు.జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రత్యేక జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.అదేవిధంగా కాలేజీ విద్యార్థినులకు విద్యాభ్యాసం, ప్రయాణ సౌలభ్యం కోసం ఈవీ స్కూటీలు అందించే కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.








