వాసవి జయంతి అధికారిక వేడుకలు:

వాసవి జయంతి అధికారిక వేడుకలు:

సీఎం రేవంత్ రెడ్డి హామీ

హైదరాబాద్ మార్చి 23, అనంత జనశక్తి న్యూస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాసవి అమ్మవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం లో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముకలాంటివారని, అభివృద్ధి, సంస్కృతి పరంగా వారి భాగస్వామ్యం విశేషమని కొనియాడారు.ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారి ఆలోచనలే ప్రజా ప్రభుత్వానికి దిశానిర్దేశమని తెలిపారు.ఈ మహోత్సవంలో నిర్వహించిన వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం ఆనందకరమని సీఎం అభినందించారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్ర్యం సాధ్యమని ప్రపంచానికి చూపించిన మహాత్మా గాంధీ తత్వాన్ని గుర్తుచేస్తూ, ఆర్యవైశ్యులు కూడా అదే మార్గంలో క్రమశిక్షణతో ముందుకు సాగారని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు బెల్ది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.