విద్యార్థుల యూనిఫాంలు మరింత ఆకర్షణీయంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థుల యూనిఫాంలు మరింత ఆకర్షణీయంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:

విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేస్తామని చెప్పారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందించినట్లు వివరించారు.విద్యార్థులందరికీ నోటు పుస్తకాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు కూడా పంపిణీ పూర్తయిందన్నారు.వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థులకు యూనిఫాం, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అదనంగా మరో 10 శాతం మంది చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఈ ఏడాది పంపిణీ చేసిన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.