
పురంలో వైసీపీకి గడ్డు… కాలమేనా…??
అనంత జనశక్తి నియోజకవర్గ రాజకీయ ఫోకస్…
-రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
-వర్గ పోరుతో పార్టీ విల…విల.
-ఒకే పార్టీ… నాలుగు వర్గాలు… వైసీపీకి అంతర్గత సంక్షోభం.
-ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలే సవాల్…!
-నాయకుల మధ్య ఆదిపత్య పోరు… కార్యకర్తల్లో అయోమయం.
-మధుమతి రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టేనా? పార్టీ బలోపేతానికి కృషిచేసినా?
-ప్రజలలోకి వెళ్లాల్సిన పార్టీ… వర్గాలకే పరిమితమా…?
-వర్గ రాజకీయాలతో ఫ్యాన్ గాలికి… ఎదురు దెబ్బ.
-గెలుపు కలలకు గండి… వైసీపీని వెంటాడుతున్న వర్గ పోరు కు ప్రజలు బేజారు…!
శ్రీ సత్య సాయి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 5, అనంత జనశక్తి న్యూస్:
హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ శ్రేణుల్లో ఆశించిన స్థాయిలో చురుకుదనం కనిపించడం లేదని, క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు కూడా పరిమితంగానే సాగుతున్నాయనే చర్చ కొనసాగుతోంది.పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకత్వ సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం, కార్యకర్తలకు దిశానిర్దేశం వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత విభేదాలపై వస్తున్న ప్రచారం, స్థానిక నాయకత్వంపై నెలకొన్న సందిగ్ధత కూడా పార్టీ శ్రేణుల్లో ప్రభావం చూపుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
హిందూపురంలో అధికార పార్టీ ప్రజా కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా ముందుకు సాగుతుండగా, ప్రతిపక్షంగా వైసీపీ తన ఉనికిని మరింత బలంగా చాటుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, క్యాడర్‌లో నమ్మకాన్ని పెంపొందించడం వంటి అంశాలు రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నాయి.అయితే హిందూపురంలో వైసీపీకి గడ్డు కాలం కొనసాగుతుందా…! లేక పార్టీ తిరిగి పుంజుకుంటుందా! అనేది ఇప్పుడే తేల్చిచెప్పలేం. నాయకత్వ నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, ప్రజా స్పందన వంటి అంశాలే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పురము లో నాలుగు గ్రూపుల… రాజకీయాలా? వ్యక్తిగత ఆధిపత్య పోరా!
హిందూపురం రాజకీయాలలో ఇప్పుడు ప్రజా సమస్యల కంటే నాయకుల మధ్య అంతర్గత విభేదాల గూర్చి ఎక్కువగా చర్చ జరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీ జెండా కింద పని చేయాల్సిన నాయకులు వేరువేరు వర్గాలుగా కనిపిస్తున్నారని ప్రచారం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు, స్థానిక నాయకులు వాపోతున్నారు. ఒకే పార్టీ… నాలుగు గ్రూపులు… నాలుగు ఎజెండా… నాలుగు వ్యూహాలు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో అభిప్రాయ భేదాలు సహజమే అయినా అవి పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే స్థాయికి చేరితే మాత్రం ఆందోళనకరమేనని పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పురం ప్రజలు అంటున్నారు. నాయకత్వం ప్రజల మధ్య కు వెళ్లి సమస్యలను ప్రస్తావించాల్సిన సమయం లో అంతర్గత ఆదిపత్య పోరాటాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోటీపడితే ప్రజల మద్దతు లభిస్తుంది. సొంత వారితోనే పోటీ పడితే పార్టీ బలహీన పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఎక్కువ ఇబ్బంది పడేది క్షేత్రస్థాయి కార్యకర్తలేనని పలువురు భావిస్తున్నారు. ఎవరిని అనుసరించాలని? ఎవరిని పిలుచుకు స్పందించాలి? పార్టీ అధికారిక వైఖరి ఏది? అనే సందేహాలు కార్యకర్తల్లో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వర్గ పోరుకు ముగింపు పలికి, సమిష్టి నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరమని పరిశీలకులు సూచిస్తున్నారు. రాజకీయ బలం, వర్గ పోరే రాజకీయ బలహీనత. ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా పార్టీ ప్రజల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.”ప్రత్యర్థుల దాడి కంటే సొంతింటి విభేదాలే ప్రమాదకరం అనే రాజకీయ సామెత” హిందూపురం రాజకీయాల సందర్భంలో మళ్లీ వినిపిస్తోంది. వ్యక్తిగత ఆధిపత్యం కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రజలలో విశ్వాసం బలపడుతుంది.
దీపిక వర్సెస్ నవీన్ నిశ్చల్…! పచ్చి గడ్డి వేస్తే భగ్గు మంటుందా…!
హిందూపురం రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ దీపిక మరియు నవీన్ నిశ్చల్ మధ్య పెరుగుతున్న రాజకీయ దూరం గురించే. ఒకప్పుడు ఒకే పార్టీ వేదికపై కనిపించిన నాయకత్వం ఇప్పుడు వేర్వేరు రాజకీయ సంకేతాలు ఇస్తోందని ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నవీన్ నిశ్చల్ మైనార్టీల లో మంచి గుర్తింపు ఉంది. స్థానికంగా ప్రజలలో సదాభిప్రాయం ఉందని వాదన బలంగా వినిపిస్తోంది. ఇటు వైసిపి పురం సమన్వయకర్త దీపిక ఆదేశాలతో పార్టీ అధిష్టానం నవీన్ నిశ్చల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అప్పటినుంచి పురంలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని, ఇద్దరి అనుచరుల వర్గాల భిన్న అభిప్రాయాలతో ముందుకు సాగుతున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని పురం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో భిన్నభిప్రాయాలు సహజమే అయినప్పటికీ అవి పార్టీ ప్రయోజనాల కంటే ముందుకు వస్తే కార్యకర్తల్లో అయోమయం నెలకొని అవకాశం ఉందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై పోటీ కంటే అంతర్గత విభేదాలే ప్రధాన చర్చగా మారితే దాని ప్రభావం పార్టీ పనితీరుపై పడే అవకాశాన్ని కొట్టి పారేయాలేమని వారు పేర్కొంటున్నారు. స్థానిక రాజకీయాలలో వినిపిస్తున్న చర్చల ప్రకారం రెండు వర్గాల మధ్య సమన్వయం, న్యాయకత్వం ఐక్యతకు మూల స్తంభాలు కావాలని కార్యకర్తల కు నమ్మకం పెరుగుతుందని ప్రజల్లో పార్టీపై బలమైన విశ్వాసం, నమ్మకం కలుగుతుందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత విభేదాల కంటే ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మారినప్పుడే పార్టీ ముందుకు సాగి బలపడే అవకాశం ఉంటుంది.
కార్యకర్తల్లో గందరగోళం:
నాయకుల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం క్షేత్రస్థాయి కార్యకర్తలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరి నాయకత్వాన్ని అనుసరించాలి? పార్టీ అధికారిక వైఖరి ఏది? అనే సందిగ్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి సవాల్….
ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాల్సిన సమయంలో అంతర్గత పోటీ ఎక్కువైతే రాజకీయంగా నష్టం కలగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ బలం పెంచుకోవడం ఒక అంశమైతే, పార్టీ సమిష్టి బలం కాపాడుకోవడం మరో ముఖ్య అంశమని వారు సూచిస్తున్నారు.
అడపాదడపా కార్యక్రమాలతో పార్టీ బలోపేతం సాధ్యమేనా?
నియోజకవర్గంలో వైసిపి కార్యకలాపాలపై పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరంగా కాకుండా కడప దడప్ప మాత్రమే జరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారని చర్చ పురంలో వినిపిస్తోంది. రాజకీయాల్లో అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం అంటే ప్రజల మధ్య నిరంతరంగా ఉండడం స్థానిక సమస్యలపై స్పందించడం పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడం నాయకత్వానికి కీలకమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి చురుకుదనం లోపిస్తే కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే వ్యక్తిగత కార్యక్రమాల కన్నా క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం కార్యకర్తలకు అందుబాటులో ఉండే న్యాయకత్వం అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిందూపురంలో వైసిపి మళ్లీ బలపడాలంటే అంతర్గత సమన్వయంతో పాటు నిరంతర రాజకీయ కార్యాచరణ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి.
ఎన్నికల తరువాత నిశ్శబ్దం… ఎంపీ అభ్యర్థి కనుమరుగు.
హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి శాంతమ్మ ఎన్నికల అనంతరం స్థానిక రాజకీయ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదని చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆమె పాత్ర పై శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానికేతర అభ్యర్థిగా బరిలోకి దిగిన శాంతమ్మ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఎన్నికల అనంతరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ బలపడాలంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా ప్రజల సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండే నాయకత్వం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వం నుంచి నిరంతర మార్గదర్శకత్వం లేకపోతే కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై సంబంధిత నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలుపడితే పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.
వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ తో పురం వైసిపికి గట్టెక్కే దారి దొరుకుతుందా…!
హిందూపురం నియోజకవర్గం లో వైసీపీ ఇప్పటికే అంతర్గత విభేదాలు, నాయకత్వ సమన్వయ లోపం, కార్యకర్తల అసంతృప్తి వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని రాజకీయ చర్చలు కొనసాగుతున్న వేల, కొందూరి వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ అంశం మరొకసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక నాయకుడి సస్పెన్షన్తో పార్టీలో క్రమశిక్షణ పెరగొచ్చు. కానీ అది ఒక్కటే పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పడం కష్టం. నాయకత్వం కార్యకర్తల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడం, వర్గ విభేదాలను తగ్గించడం, ప్రజా సమస్యలపై సమర్థంగా స్పందించడం వంటి అంశాలే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మార్పు కంటే పార్టీ పనితీరు, ప్రజలతో అనుబంధం, స్థానిక నాయకత్వం సమన్వయం కీలకం. కార్యకర్తలలో ఉత్సాహం నింపి అంతర్గత విభేదాలకు ముగింపు పలికితేనే వైసీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది.
పదునైన వ్యాఖ్యలు….
>ఒక్క సస్పెన్షన్ తో సంక్షోభం ముగియదు… న్యాయకత్వం మారితేనే పరిస్థితులు మారుతాయి.
>వ్యక్తులపై చర్యల కంటే ప్రజల నమ్మకం సంపాదించడమే అసలైన రాజకీయ పరీక్ష.
>వర్గ పోరు స్థిరపడకపోతే ఏ నిర్ణయమైనా ఫలితం పరిమితంగానే ఉంటుంది.
>గెలుపు కోసం క్రమశిక్షణ అవసరం…. కానీ క్రమశిక్షణతో పాటు సమన్వయం కూడా అంతే ముఖ్యం.
>నాయకుడి నిష్క్రమణ కాదు… కార్యకర్తల ఐక్యతే పార్టీకి నిజమైన బలం.
హిందూపురంలో వైసిపి భవిష్యత్ ఒకే నిర్ణయం పై ఆధారపడదు. పార్టీ అంతర్గత పరిస్థితులను ఎలా చక్క దిద్దుకుంటుంది. కార్యకర్తల్లో ఎంత విశ్వాసాన్ని కల్పిస్తుంది అనేది రానున్న రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అంశంగా ప్రజా నాయకత్వం భావిస్తున్నారు.
మధుమతి రెడ్డి చేతికి వైసిపి పగ్గాలా….? అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపుతుందా?
బలోపేతానికి కొత్త ముఖంపై పార్టీ ఆశలు పెట్టుకుందా….? పురం నియోజకవర్గంలో వైసిపి భవిష్యత్ పై చర్చలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. పార్టీకి ఎదురైనా వరుస ఎదురుదెబ్బలు, నాయకత్వ లోపం, అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ పగ్గాలను సమర్థంగా చేపట్టగల నాయకురాలు ఎవరు అన్న ప్రశ్న కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మధుమతి రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే కేవలం సమావేశాలు, ప్రకటనలు సరిపోవని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురాగల నాయకత్వం అవసరమని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అలాంటి సమయంలో మధుమతి రెడ్డి బాధ్యతలు చేపడితే పార్టీకి కొత్త ఊపు రావచ్చని అభిప్రాయం కొందరిలో వ్యక్తమౌతోంది. అయితే అధిష్టానం నిజంగానే ఆమెపై మొగ్గు చూపుతోందా? లేక కొత్త సమీకరణాలకు తెరలేపుతోందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో బలోపేతానికి సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేయాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి అతిపెద్ద సవాళ్లు ప్రత్యర్థి పార్టీ కాదు… సొంత వర్గ విభేదాలే. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే ఎంత బలమైన పార్టీ అయినా క్షీణించడం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. కార్యకర్తలలో నమ్మకం నింపి, గ్రామస్థాయి నుంచి పార్టీని పునర్వ్యవస్థీకరణ చేయగలిగే నాయకత్వం ఇప్పుడు అత్యవసరంగా మారింది. మధుమతి రెడ్డి ఆ బాధ్యతలను భుజాన వేసుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారా? అధిష్టానం అంటూ పూర్తి బాధ్యతలు అప్పగిస్తుందా? లేక మరో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకు వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేల నుంది. ప్రస్తుతం మాత్రం హిందూపురం వైసిపి రాజకీయాల్లో మధుమతి రెడ్డి పేరు చుట్టూ చర్చలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధికారిక నిర్ణయం వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ ఊహాగానాలుగా పరిగణించాలి.
పురంలో వైసిపి మరింత డీలాపడేనా…?
అధిష్టానం భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోందా? పురం నియోజకవర్గంలో వైసిపి రాజకీయ పరిస్థితులు రోజురోజుకు చర్చనీయంశంగా మారుతున్నాయి. నాయకత్వం లో స్వస్థత లేకపోవడం, అంతర్గత విభేదాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహం పార్టీ బలంపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. స్థానికంగా వర్గ పోరు కొనసాగుతుందని ప్రచారం పార్టీకి ప్రతికూల సంకేతాలను పంపు తోందనే అభిప్రాయం పడుతున్నారు. పార్టీ శ్రేణులను ఒకే వేదికపై తీసుకురావటం, సమన్వయంతో ముందుకు సాగడం ఇప్పుడు అత్యవసరంగా కనిపిస్తోంది. లేకపోతే క్షేత్రస్థాయిలో మరింత బలహీనత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు అధిష్టానం కార్యాచరణ రూపొందిస్తోందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కొత్త బాధ్యతల కేటాయింపు, అసంతృప్తి నేతలతో చర్చలు, కార్యకర్తలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టే అవకాశం పై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికార ప్రకటనలు వెలుపడాల్సి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ కి ఇది కీలక సమయంగా మారింది. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయగలదా? లేక అంతర్గత విభేదాలే మరింత నష్టాన్ని మిగిల్చుతాయా? అన్న ప్రశ్నకు రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి.
రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు…. వైసిపి సరికొత్త అధ్యాయానికి నాంది పలికేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీకి ఎదురయ్యే అసలైన పరీక్ష పునర్నిర్మాణమే. ప్రస్తుతం అదే సవాలను వైసీపీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ తనను తాను పునర్వ్యవస్థీకరించుకొని రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? అన్న ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక రాజకీయ పార్టీ బలం కేవలం నాయకత్వంతోనే నిర్ణయించబడదు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజలతో నిరంతర అనుబంధం, స్థానిక నాయకత్వ సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాట పటిమా ఈ నాలుగు స్తంభాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల్లో వైసిపి తన కార్యాచరణను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తుందో అదే పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న అంతర్గత విభేదాలు, అసంతృప్తి, స్థానిక స్థాయిలో సమన్వయం లోపాలపై పార్టీ దృష్టి సారించి, వాటిని అధికమించే ప్రయత్నం చేస్తేనే కొత్త రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. లేకపోతే ప్రత్యర్థులకు రాజకీయ అవకాశాలు మరింత విస్తరించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజల సమస్యలపై నిరంతర పోరాటమే అతిపెద్ద ఆయుధం. సభల్లో చేసే విమర్శల కంటే ప్రజల మధ్య చేసే ఉద్యమాలే విశ్వసనీయతను పెంచుతాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విధానాలు, స్పష్టమైన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో చురుకైన నాయకత్వం కనబరిస్తేనే ప్రజల మద్దతును తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ప్రజల తీర్పు కూడా కాలాను గుణంగా మారుతుంది. అయితే ఆ మార్పును అవకాశంగా మలుచుకోవడం ప్రతి రాజకీయ పార్టీ చేతుల్లోనే ఉంటుంది. వైసిపి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతుందా? లేక అంతర్గత సవాళ్లను అధిగమించడంలోనే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో పార్టీ తీసుకుని నిర్ణయాలు, ప్రజల స్పందన, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత విజయాలు, శాశ్వత పరాజయాలు ఉండవు. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల విశ్వాసాన్ని మళ్లీ సంపాదించ గలిగిన వారే తదుపరి రాజకీయ అధ్యాయాన్ని రాస్తారు. వైసిపి ఆ దిశగా అడుగులు వేస్తుందా! లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
అందరి చూపు పురం వైసిపి రాజకీయాల వైపే… మార్పు మంత్రం పలుకుతుందా? లేక మౌనమే మూల్యం చెల్లిస్తుందా?
హిందూపురం వైసిపి రాజకీయాలు ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. ఒకప్పుడు పార్టీకి బలమైన స్థావరంగా గుర్తింపు పొందిన ఈ నియోజకవర్గం ఇప్పుడు నాయకత్వ సమీకరణలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల అంచనాలతో రాజకీయ చర్చల కేంద్రబిందువుగా మారింది. అందుకే అందరి చూపు ఇప్పుడే పురం వైసిపి రాజకీయాల పైనే నిలిచింది. ఏ రాజకీయ పార్టీకి అయినా ఎన్నికల ఓటమి అంతిమం కాదు. అయితే ఓటమి తర్వాత తీసుకునే నిర్ణయాలే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అదే కోణంలో చూస్తే పురం వైసిపి ముందున్న అసలు పరీక్ష ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడంలో కాదు ముందుగా తన సొంత శ్రేణుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో ఉంటుంది. రాజకీయాల్లో నాయకత్వం శూన్యత, అంతర్గత సమన్వయ లోపం, క్షేత్రస్థాయి చురుకుదనం తగ్గడం వంటి అంశాలు ప్రత్యర్థులకు అవకాశాలుగా మారుతాయి. మరోవైపు సమయానుకూలంగా న్యాయకత్వ నిర్ణయాలు, స్వస్థమైన కార్యాచరణ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం పార్టీకి కొత్త ఊపిరిని అందించగలవు. ప్రస్తుతం పురం వైసిపి ఈ రెండు మార్గాల కూడలిలో నిలిచినట్లు రాజకీయ విశ్లేషకులు, ప్రజా మేధావులు భావిస్తున్నారు. రాబోయే నెలలు ఈ నియోజకవర్గ రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి. పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టగలుగుతుందా? కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తుందా? కార్యకర్తల ఉత్సాహాన్ని తిరిగి రగిలిస్తోందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే భవిష్యత్ రాజకీయ దిశ స్వస్థమవుతుంది. ఒక విషయం మాత్రం స్పష్టం…. పురం రాజకీయాలు ఇక స్థానిక అంశంగా మాత్రమే మిగలడం లేదు. ఇక్కడి పరిణామాలు రాష్ట్రస్థాయి రాజకీయ సంకేతాలుగా మారే అవకాశం ఉంది. అందుకే రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ శ్రేణులు పరిశీలకులు అందరూ ఈ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇప్పుడు నిర్ణయాత్మక ఘట్టం వైసిపి ముందుంది. పార్టీ తన అంతర్గత బలాన్ని సమీకరించి కొత్త రాజకీయ సందేశంతో ముందుకు సాగుతుందా? లేక కొనసాగుతున్న సవాలనే ఎదుర్కొంటూ రక్షణాత్మక రాజకీయాలకు పరిమితమవుతుందా? అన్నది రానున్న పరిణామాలే తేల్చలున్నాయి. ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… పురం వైసిపి రాజకీయాలు ఇక ఒక నియోజకవర్గ కథ కాదు; రాష్ట్ర రాజకీయాల దిశను ప్రభావితం చేసి చర్చగా మారుతున్నాయి.








