
*మెదడులోని రక్తనాళాలకు అరుదైన చికిత్స
తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు లాంటి సమస్యలు
లక్ష మందిలో ఒకరికే వచ్చే అత్యంత అరుదైన సమస్య
ఆరు గంటల శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
అనంతపురం,నవంబర్,20, అనంత జనశక్తి న్యూస్
ఆయన కాయకష్టం చేసుకునే రైతు. వయసు 47 ఏళ్లు. అప్పటివరకు పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. తర్వాత క్రమంగా కొన్ని విషయాలు మర్చిపోవడం మొదలైంది. దీంతో ఆయన అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనను క్షుణ్ణంగా పరీక్షించి, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి నయం చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ సి. అనిల్ మరియు డా. మురళీ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“కనేకల్లుకు చెందిన పకీరప్ప అనే ఆ రైతు తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు, ఇతర లక్షణాలతో మా వద్దకు వచ్చారు. వెంటనే ఆయనకు సీటీ యాంజియోగ్రామ్ పరీక్ష చేసి అసలు సమస్య ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేశాం. అప్పుడు ఆయనకు ఆర్టెరియోవీనస్ మాల్‌ఫార్మేషన్ (ఏవీఎం) అనే సమస్య ఉందని తెలిసింది. సాధారణంగా మనకు రక్తనాళాల నుంచి కాపిలరీల గుండా మెదడులోకి రక్తప్రసారం అవుతుంది. కానీ, ఈయన విషయంలో అలా కాకుండా నేరుగా రక్తనాళాల నుంచి నరాల్లోకి రక్తం వెళ్లిపోయింది. దాంతో నరాలు బాగా ఉబ్బిపోయాయి. అవి సరిగ్గా మెదడులో కీలక ప్రాంతాల వద్దే ఉబ్బడంతో ఈయనకు మతిమరుపు లాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని అలాగే వదిలేసి ఉంటే ఉబ్బిన నరాలు పగిలిపోయి.. ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇలా ఉబ్బిన నరాలు సరిగ్గా మెదడులో మాట, కదలికలను నియంత్రించే ప్రాంతంలో ఉండడంతో వాటిని తొలగించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అవుతుంది.కన్సల్టెంట్ న్యూరోసర్జన్లు డాక్టర్ సి. అనిల్, డాక్టర్ మురళీ మోహనకృష్ణ కలిసి అత్యాధునిక మైక్రోసర్జికల్ విధానాలు, ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ సహాయంతో శస్త్రచికిత్స మొదలుపెట్టారు. దాదాపు ఆరు గంటలకు పైగా సాగిన ఈ శస్త్రచికిత్సలో అత్యంత జాగ్రత్తగా ఉబ్బిన నరాలను పూర్తిగా తొలగించారు. దాంతో మెదడులోకి రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంది. ఇలా ఏవీఎం అనేది లక్షమందిలో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన సమస్య. ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఐదో రోజునే ఆయన్ను డిశ్చార్జి చేశాం. మాట, నడక అన్నీ సాధారణంగానే ఉంటూ.. ఆయన తన పనులన్నీ తాను చేసుకోగలుగుతున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు పుట్టుకతోనే ఉంటాయి. అయితే, నరాలు ఉబ్బడం అనేది క్రమంగా పెరిగే సమస్య కావడంతో తీవ్రమైన తలనొప్పి, ఇతర లక్షణాలు కనిపించేవరకు చాలామందికి తెలియదు. ప్రధాన రక్తనాళాల నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చే ప్రవాహాన్ని కాపిలరీ నెట్‌వర్క్ కొంత నెమ్మదింపజేస్తుంది. అప్పుడు మెదడుకు కావల్సినంత స్థాయిలో మాత్రమే రక్తం వెళ్తుంది. అలా కాకుండా నేరుగా వెళ్లిపోవడం వల్ల రక్తప్రసారం ఎక్కువ అయ్యి ఈ సమస్య వస్తుంది. నరాలు పగిలితే అంతర్గత రక్తస్రావం అయ్యి, ప్రాణాలకే ముప్పు సంభవిస్తుంది.ఇలాంటి సమస్యలకు ఇంతకుముందైతే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యంత నిపుణులైన వైద్యబృందం ఉండడంతో పాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండడంతో ఎలాంటి సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సలైనా ఇక్కడే చేసే వీలుంది. అందువల్ల అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రధాన సమస్యలకు ఇక్కడే చికిత్స పొందొచ్చు” అని డాక్టర్ సి. అనిల్ వివరించారు.








