
హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్
అనంత జనశక్తి సినిమా న్యూస్
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలంటూ ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరోపణలతో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో తనపై తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.గత ఏడాది డిసెంబర్ 19న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణ ప్రకారం, నెల రోజుల వ్యవధిలో అమన్ ఆరు సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి అమన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.








