
కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
గుడికట్ల పూజారులకు గౌరవవేతనం అందిస్తాం
బైరవానితిప్ప ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం
కేంద్రంతో మాట్లాడి ఆర్ డీటీ లైసెన్సు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం..
భక్త కనకదాస జయంతి సభలో మంత్రి నారా లోకేష్
కళ్యాణదుర్గం, నవంబర్ 08 :అనంత జనశక్తి న్యూస్
తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన కురుబ సోదరులను మరువం, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ వారి మాటల్లోనే… తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు అన్ని విధాలుగా టీడీపీకి అండగా నిలిచారు. ఇప్పుడు మేము బీసీలను బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కృషిచేస్తున్నాం. ఈ రోజు చాలా మంచి రోజు. మహా భక్తుడు కనకదాస గారి జయంతి. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహావిష్కరణ చేయడం, కనకదాస గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం నా జీవితంలో మార్చిపోలేని రోజు. ఒకే రోజు మూడు పండుగలను కురుబ సోదరులతో కలిసి జరుపుకోవడం నా అదృష్టం. కనకదాస గారు గొప్ప పాటలతో శ్రీకృష్ణుడుని తన వైపు తిప్పుకున్నారు. ప్రజల్లో దైవ భక్తిని పెంచారు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. చిన్నతనంలో బాగా చదువుకున్నారు. సైన్యంలో చేరి యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని భక్తికి, ప్రజలకు అంకితం చేశారు. ఒక రోజు కనకదాస గారిని ఆయన గురువు నీకు మోక్షం పొందాలని లేదా అని అడిగారు. అప్పుడు కనకదాసు గారు అహంకారం అనేది పోతే మోక్షం వస్తుంది అని చెప్పిన గొప్పవ్యక్తి ఆయన. కనకదాసు గారి జీవితం మనకు స్పూర్తి. ఆయన చూపిన మార్గంలో సమాజం నడవాలి.
భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేస్తాం
భైరవతిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది టీడీపీ, పూర్తిచేసేది కూడా టీడీపీనే. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. కరువుసీమలో కార్ల పంట పండించిన చరిత్ర టీడీపీది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పుడు పరిశ్రమలు తెస్తున్నాం. జిల్లాలో హార్టికల్చర్ కు సాయం అందిస్తాం. తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకొస్తాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఆర్ డీటీ సంస్థ అనేక సేవలు అందిస్తోంది. హాస్పటల్స్, పాఠశాలలు, స్వయం ఉపాధి పరంగా సేవలు చేస్తున్నారు. వారి లైసెన్సు పునరద్ధరణ ఆలస్యమైంది. నేను బాధ్యతగా తీసుకుని కేంద్రంతో మాట్లాడి లైసెన్సును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నాం.. ఇకపై వారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళతాం. బీసీ సోదరులు ఒక విషయాన్ని ఆలోచించాలి. టీడీపీ వల్లే బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. 3,132 కి.మీ.లు పాదయాత్ర చేసినప్పుడు ఉపకులాలను కలిశా. మీ సమస్యలను నేరుగా తెలుసుకున్నా, ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోను. ఫైర్ బ్రాండ్ మంత్రి సవితమ్మ మీకు ఉన్నారు. చెప్పిన పని అయ్యేవరకు ఆమె వదిలిపెట్టరు. బీసీ సంక్షేమ మంత్రిగా ఆమెకు కూడా బాధ్యత ఉంది. ఇచ్చిన హామీలను మనం నిలబెట్టుకోవాలి. ఎంపీ పార్థసారధి కేంద్రంతో పోరాడుతున్నారు, నిధులు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలతో కురుబలకు అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లండి.
అనంతపురం జిల్లాకు రుణపడి ఉంటాం
ఉమ్మడి అనంతపురం జిల్లాకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. ఎన్టీఆర్ ను 3సార్లు శాసనసభకు పంపించింది. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు, మరొక మామ బాలకృష్ణను మూడుసార్లు గెలిపించి శాసనసభకు పంపిన గొప్పనేల అనంతపురం. ఈ నేలకు మేము ఎంతచేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అనంతపురం అంటే టీడీపీ, టీడీపీ అంటేనే అనంతపురం. టీడీపీని కురుబలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్యం వచ్చింది టీడీపీతోనే. కురుబ సోదరులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు కురుబలు అంటే ప్రత్యేక ప్రేమ. కురుబలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసింది టీడీపీ. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం కురుబ సామాజికవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కురుబ కార్పొరేషన్ ను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కురుబ కమ్యూనిటీకి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసింది. గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, బీమా కూడా ఇచ్చాం. 50% సబ్సిడీతో 4 లక్షల వరకు రుణసౌకర్యం కల్పించాం. కురుబ కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. కురుబ సామాజిక వర్గాన్ని రాజకీయంగా టీడీపీ ప్రోత్సహించింది. ఎస్.రామచంద్ర రెడ్డి గారు 14 శాఖలతో మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. బీకే పార్ధసారధి ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పి ఛైర్మన్ గా పనిచేశారు. సవిత గారు గతంలో కురుబ కార్పోరేషన్ ఛైర్మన్ గా పనిచేసి, నేడు మంత్రిగా పనిచేస్తున్నారు. కురుబ సాధికార రాష్ట్ర సభ్యుడు బస్తిపాటి నాగరాజు గారు ఇప్పుడు కర్నూలు ఎంపీ. అనంతపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, కర్నూలు జడ్పి ఛైర్మన్ బత్తిన వెంకట రాముడు కురుబ సామాజికవర్గానికి చెందిన వారు. చాలా మందికి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవులు కూడా లభించాయి.
వైసీపీ హయాంలో చీకటిరాజ్యం
2019 నుంచి 2024 వరకు చీకటి రాజ్యం చూశాం. బీసీ సోదరుల్లో తిరుగుబాటు వచ్చింది. 94శాతం సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పాదయాత్రలో కురుబ సోదరులు కనకదాసుగారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నన్ను కోరారు. వారి కోరిక మేరకు ఈరోజు అధికారికంగా కనకదాసు జయంతిని నిర్వహిస్తున్నాం.బెర్రప్ప పేరుతో గుడులను టీటీడీ సహకారంతో కట్టిస్తాం. పూజారులకు త్వరలోనే గౌరవవేతనం అందజేస్తాం. గతంలో కురుబ సోదరులకోసం అనేక కమ్యూనిటీ భవనాలు ప్రారంభించాం. అసంపూర్తిగా నిలిచిపోయిన కురుబ భవనాలను వచ్చే 12నెలల్లో పూర్తిచేస్తాం. ఆదరణ పథకం కింద పనిముట్లు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కురుబ సోదరులకు ఇన్సూరెన్స్, షెడ్లు కోరారు. పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్న పవనన్న ఆవుల కోసం షెడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఆయనతో మాట్లాడి కురుబల కోసం షెడ్లు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. యువగళంలో నేను ఇచ్చిన అన్ని వాగ్దానాలను గుర్తుంచుకున్నాను. నా పాదయాత్రలో నేను కురుబ సమాజాన్ని కలిసి, వారి బాధలను ప్రత్యక్షంగా చూశాను. కనకదాసు గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నేడు నెరవేర్చాం, బెర్రప్ప దేవాలయాలను నిర్మించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. కురుబ పూజారులకు గౌరవవేతనం జీవో త్వరలో విడుదల చేస్తాం. కురుబల దేవాలయాలకు పూజాధికాల కోసం ఆర్థికసాయం అందిస్తాం. బీమా పథకాన్ని ఎలా అమలు చేయాలో పరిశీలన చేస్తాం. మేత భూములు, దాణా, మందులు, షెడ్‌లు వంటి సమస్యలను కురుబ సోదరులు నా దృష్టికి తెచ్చారు. వాటన్నింటినీ ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా పరిష్కరించి, మీ ఆదాయాన్ని మెరుగుపర్చేందుకు కృషిచేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కురుబ సవిత, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ పార్థసారధి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, కురుబ కార్పోరేషన్ ఛైర్మన్ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.








