
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి
వర్షాకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు పంచాయతీలు సిద్ధంగా ఉండాలి
పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి
తాగునీటి పైపుల్లో లీకేజీలు లేకుండా నిరంతర తనిఖీలు నిర్వహించాలి
ప్రతి పంచాయతీలో బ్లీచింగ్, క్లోరిన్ బిళ్లలు అందుబాటులో ఉంచుకోవాలి
ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచండి
సీజనల్ వ్యాధుల నివారణా చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి జూన్ 26, అనంత జనశక్తి న్యూస్
వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే , కమిషనర్ శ్రీ కృష్ణ తేజ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నిలిచి ఉన్న నీటి కారణంగా దోమలు, పైపు లైన్ల లీకేజీ నుంచి వర్షపు నీరు తాగునీటిలో కలసి పోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలి. అవసరమైన ప్రాంతాల్లో వీటిని తక్షణం వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. దోమల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఘన వ్యర్థాల నిర్వహణ, రోజు వారీ చెత్త సేకరణ శాస్త్రీయపద్ధతిలో నిర్వహించాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దుర్ఘంధం వ్యాప్తి చెందుతుంది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలి.రాష్ట్ర వ్యాప్తంగా “ఫ్రైడే – డ్రైడే” కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టి నీటి నిల్వలను గుర్తించి, తొలగించే ఏర్పాటు చేయాలి. దోమల బెడద పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దోమల నివారణకు ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలి.తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ అవసరం. ముఖ్యంగా పైపు లైన్లలో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలి. కలుషిత నీటి వల్ల అతిసారం వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. కలుషిత నీటి వనరులను గుర్తించిన వెంటనే ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.గ్రామ సభలు నిర్వహించి పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులు, మైక్ అనౌన్స్ మెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలి. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే తాగునీటి నాణ్యత, పారిశుధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ప్రజారోగ్య పరిరక్షణ చర్యల్లో నిర్లక్ష్యాన్ని సహించం. చర్యలు అవసరం ఉన్న చోట యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి. జిల్లా స్థాయి, మండల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యాధుల వ్యాప్తి సమాచారం అందిన వెంటనే స్పందించే ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలి.







