
రప్పా రప్పా అంటే రెండు ఒకట్లలో, ఉన్న ఒకటి కూడా పోతుంది
– జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులకు నా సలహా
– పన్నెండేళ్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాం, మీ బెదిరింపులు ఎంత..?
– ప్రజా క్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు
– ఫలితంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు నాణ్యమైన రోడ్లతో కళకళలాడుతున్నాయి
-అనకాపల్లి సీటు వదులుకున్న కారణంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేయగలిగాననే సంతృప్తి నాకు ఉన్నది
ఎచ్చెర్లలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు
విజయవాడ మార్చి 14, అనంత జనశక్తి న్యూస్
మళ్ళీ అవకాశం వస్తే అడ్డం వచ్చిన వారినల్లా రప్పా రప్పా నరుకుతాం అంటూ అదే మాట మళ్ళీ మళ్ళీ అంటోన్న వైసీపీ నాయకులను చూస్తుంటే జాలేస్తోంది, ఒకవేళ అవకాశం వస్తే ప్రజలకు చేయదలచుకున్న మంచి ఏంటో చెప్పకుండా.. రప్పా రప్పా నరకడమే అంటే ఇప్పుడు ఉన్న రెండు ఒకట్లలో ఉన్న ఒకటి కూడా పోతుంది, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీకి ఇది నా సలహాగా చెప్తున్నా.. అని శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వందలాది సంఖ్యలో స్థానిక ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. కె. నాగబాబు చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎచ్చెర్ల జనసేన పీవోసీ విశ్వక్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కె. నాగబాబు మాట్లాడారు. పన్నెండేళ్ల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసామని, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న వాటితో పోలిస్తే ఇప్పుడు మీ బెదిరింపులు ఎంత..? అని ప్రశ్నించారు. ప్రజాక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారని, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలకు ఫలితంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు నాణ్యమైన రోడ్లతో కళకళలాడుతున్నాయని ఉద్ఘాటించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీకి అవకాశం ఇస్తే అసెంబ్లీకి రాకుండా 11 నియోజకవర్గాలకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజల అవసరాలను, వారిగొంతుకను నొక్కుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు కలిసున్నంతవరకూ వైసీపీ ఆటలుసాగవని, ఇంకా పదిహేనేళ్లకుపైగానే కూటమి ఐక్యత కొనసాగుతుందని వెల్లడించారు. జనసేనలో నాయకులకు సమానంగా కార్యకర్తలు కూడా పనిచేయగల సామర్థ్యం ఉన్నదని, కార్యకర్తలను కూడా అత్యున్నత స్థాయి హోదాల్లో అవకాశాలు కల్పించే సంస్కృతి జనసేనలో ఎక్కువగా ఉంటుందని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమంలో అయినా కార్యకర్తకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ఆ రోజు అనకాపల్లి అభ్యర్థిగా సీటు వదులుకున్న కారణంగానే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేయగలిగాననే సంతృప్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు. గొప్పఆశయాలు, వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్నవారు గొప్పవారు అవుతారనడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిదర్శనమని, ప్రజలిచ్చిన అధికారంతో రెండేళ్లలోనే ఫామ్ పాండ్, నీటితొట్టెలు, మేజిక్ డ్రైన్స్, మేజిక్ సోక్ పిట్, రహదారులు ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మించారని, తద్వారా మారుమూల గ్రామాలకు అంబులెన్స్ వెళ్లగలుగుతోందని అన్నారు. ఇంకా మూడేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ మంత్రిగా.. పొలాలపై ఏనుగుల బెడదను, ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టగలిగారని అన్నారు. ఉప్పాడ సముద్రతీరాన ఉన్న గ్రామాలను రక్షించేందుకు గౌరవ ప్రధానితో మాట్లాడి రిటైన్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతిమారుమూల ప్రాంతానికి మంచినీరు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.








