మహిళపై దాడి ఘటనపై సీఎం ఆగ్రహం..

మహిళపై దాడి ఘటనపై సీఎం ఆగ్రహం..

కఠిన చర్యలకు ఆదేశం

నిందితుడి అరెస్ట్.. పార్టీ నుంచి సస్పెన్షన్

అమరావతి, జులై 18, “అనంత జనశక్తి న్యూస్”

గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలను అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల రక్షణ విషయంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.