
జిల్లాలను ప్రమోట్ చేయండి… పెట్టుబడులను ఆకర్షించండి: సీఎం చంద్రబాబ
కలెక్టర్లకు 3C ఫార్మూలా – కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్
అమరావతి, మార్చి 12:
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో జిల్లా కలెక్టర్లు కూడా కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పెట్టుబడులు, పర్యాటక శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన కలెక్టర్లకు 3C ఫార్మూలా (Commitment, Convince, Cooperate)ను నిర్దేశించారు. పెట్టుబడిదారులను ఆకర్షించి, వారికి అవసరమైన సహకారం అందించి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాల వారీగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్
పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటులో జిల్లాల పనితీరును అంచనా వేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాలకు ర్యాంకులు ఇస్తామని సీఎం తెలిపారు. పెట్టుబడులపై జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పెట్టుబడులు పెరిగితే స్థానిక యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
అమరావతిలో క్రియేటివ్ సిటీ… హిందూపూర్‌లో ఎలక్ట్రానిక్స్ సిటీ
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. AI, ఫిల్మ్, కంటెంట్ క్రియేషన్ రంగాలను ప్రోత్సహించి క్రియేటివ్ ఎకానమీని పెంచుతామని తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీ ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా వెల్లడించారు.
మూడు ఆర్థిక అభివృద్ధి ప్రాంతాల ఏర్పాటు
రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, పెట్టుబడుల అభివృద్ధి బాధ్యతను ప్రత్యేక అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పరిశ్రమ హోదా కల్పించామని సీఎం చెప్పారు. పాపికొండలు, గండికోట, సూర్యలంక వంటి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు, హోమ్ స్టేలు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.








