
భక్తుల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలి
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన
– ఉమా మార్కండేయస్వామి ఆలయం నూతన కమిటీ వెల్లడి
రాజమహేంద్రవరం, నవంబర్ 2, అనంత జనశక్తి న్యూస్
భక్తుల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలని ఉమా మార్కండేయ స్వామి ఆలయం నూతన పాలకవర్గానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలకు వరుసగా కమిటీలు వేయడం జరుగుతోంది. ఈ కమిటీలో భాగంగా నగరంలో అతి ముఖ్యమైన ప్రాచీన దేవాలయమైన గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయస్వామి ఆలయానికి నూతనంగా నియమించబడిన కమిటీని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో నగర టీడీపీ కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్‌తో కలిసి వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్‌గా మదన్ సింగ్ రాజా పురోహిత్, సభ్యులుగా పెండ్యాల నాగేశ్వరరావు, రాజా పురోహిత్ రూప్‌సింగ్, బి రవికుమార్, బ్రింగిమళ్ళ పద్మావతి, శనపతి సత్తిబాబు, గ్రంధి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, గొంగాడ సురేష్, బి గౌతమిలను నియమించినట్టు తెలిపారు. అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులుగా నీలకంఠ శర్మను నియమించినట్టు తెలిపారు. ఈ కమిటీ త్వరలోనే అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనుందన్నారు. ఉమా మార్కండేయస్వామి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. పుష్కరాల ఆ ఆలయం సమీప ప్రాంతంలో జరుగుతాయన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని, భక్తులకు కావాల్సిన సౌకార్యాలు కల్పిస్తూ సమర్ధవంతంగా పని చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కూటమి విజయం కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతోందన్నారు. గత వైకాపా పాలనలో అప్పటి పాలకులు ఈ దేవాలయాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. క్షమించరాని పాపం చేశారని దుయ్యబట్టారు. వారు చేసిన తప్పిదాన్ని గుర్తించి కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లోనే సరి చేశామన్న విషయాలను త్వరలోనే చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








