
రాయవరం మండలంలోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి అనిత
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది
ఫైర్‌వర్క్స్ తయారీ కేంద్రాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం
ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది*:-హోం మంత్రి అనిత.
రాయవరం, అక్టోబర్ 08, అనంత జనశక్తి న్యూస్
కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరిపాలెం శివారులోని వి. సావరం ప్రాంతంలో గణపతి ఫైర్‌వర్క్స్ తయారీ కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. విద్యుత్ ఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు వెల్లడించారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. ఫైర్‌వర్క్స్ తయారీ కేంద్రాలకు అన్ని విధాల నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయబడతాయని స్పష్టం చేశారు. అనుమతి ఉన్నప్పటికీ, విధుల్లో నిర్లక్ష్యం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. బాణాసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించాం. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేలా చేస్తాం అని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలో పరిహారం ప్రకటించబడుతుందని ఆమె హామీ ఇచ్చారు. గాయపడిన లింగం చిన్నబాబు, చిట్టూరి యామినిలను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు కార్మికులు సజీవ దహనమవడం చాలా హృదయ విదారకంగా ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం అని మంత్రి అన్నారు. మంత్రి అనితతో పాటు మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్టీవో దేవరకొండ అఖిల, అగ్నిమాపక విపత్తుల శాఖ అధికారి సారథి, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పరిశీలనలో పాల్గొన్నారు.








