
ఘరానా దొం
గృహ నిర్మాణ శాఖలో డివిజనల్ స్థాయి అధికారి ప్రైవేటు దందా
– ప్రభుత్వ పరికరాలు మాయం చేసి.. సొంత వ్యాపారం
విధి నిర్వహణను గాలికి వదిలి.. ఆపై మాతృ సంస్థకు ద్రోహం
సర్కారు ఆదాయానికి గండికొడుతున్న వైనం
రెండేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం
అయినా అడిగే వారు లేరనే ధీమాతో బహిరంగంగానే కొనసాగుతున్న తంతు
గృహ నిర్మాణ శాఖలో ఆయనో డివిజన్ స్థాయి అధికారి. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయిని. ఇద్దరికీ మంచి జీతాలు. అయినా అతనిలో ధనదాహం తీరలేదు. మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. చేతిలో అధికారం ఉన్నప్పుడే అడ్డంగా సంపాదించాలనుకున్నాడో ఏమో తన పదవిని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోచేస్తున్నాడు. ప్రభుత్వం సరఫరా చేసిన పరికరాలను గుజరీ కింద లెక్కకట్టి సొంతానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. వాటితో ప్రైవేటుగా ఫెన్సింగ్ స్తంభాలు తయారు చేసి అమ్ముకోవడం ద్వారా కోట్లకు పడగలెత్తాడు. సొంత శాఖకు పంగ నామాలు పెట్టాడు. ఈ అంశం అనంతపురం గృహ నిర్మాణ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం అక్టోబర్ 08, అనంత జనశక్తి బ్యూరో
అనంతపురం గృహ నిర్మాణ శాఖలో డివిజన్ స్థాయి అధికారి హోదాలో ఉద్యోగం వెలగబెడుతున్న ఓ అధికారి తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేస్తున్న ప్రైవేటు దందా.. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారేలా చేస్తోంది. సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అయినా ఏ ఒక్క అధికారి కూడా ఆయనపై ఇంత వరకు దృష్టి పెట్టిన పాపాన పోలేదు.
ఎవరూ ఆ అధికారి అంటే..
అనంతపురం సహా సమీప నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు డివిజనల్ స్థాయి అధికారి మరో రెండు పోస్టుల్లోనూ కొనసాగుతున్నాడు. హౌసింగ్ శాఖలో అత్యధిక శాతం మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావడం.. సదరు అధికారి రెగ్యులర్ ఉద్యోగి కావడంతో పాటు సీనియారిటీ ఉండడం.. మరో రెండేళ్లలో రిటైర్డ్ కానుండంతో ఆయనకు అక్రమ ఆదాయం మీద దృష్టి పడింది. తన వాక్చాతుర్యంతో శాఖ ఉన్నతాధికారి మంచితనాన్ని ఆసరా చేసుకొని అడ్డంగా సంపాదించడం మొదలుపెట్టాడని శాఖ ఉద్యోగులు అంటున్నారు.
ప్రైవేటు దందాలో బిజీగా మారిన తీరు
నిలువ నీడ లేని నిరు పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఆనవాయితీ. ఇళ్లు మంజూరైన లబ్దిదారులకు కావాల్సిన ఇటుకలు. పైకప్పుకు వేసే సిమెంట్ తీర్లను సొంతంగా తయారు చేసి సరఫరా చేస్తారు. అందుకు లబ్దిదారులకు వచ్చే బిల్లులో వాటి ఖర్చును మినహాయించుకుంటారు. ఆ విధంగా అనంతపురం అర్బన్, రూరల్ మండలాలు సహా కూడేరు, గార్లదిన్నె, రాప్తాడు. బుక్కరాయసముద్రం మండలాలకు చెందిన లబ్దిదారులకు గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ తీర్లు, ఇటుకలు తయారు చేసి ఇచ్చేందుకు నిర్మితి కేంద్రాలను ఏర్పాటు చేసింది. దానికి ఇన్చార్జిగా వ్యవహరించే అధికారే అక్కడి నిర్మితి కేంద్రం మూతపడటానికి కారణం కావడం గమనార్హం. ప్రభుత్వం సరఫరా చేసిన ఇటుకలు, సిమెంట్ తీర్లు తయారు చేసే అచ్చులను సదరు అధికారి అవి పనికి రావని తేల్చేసి, అనంతరం వాటిని తన సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమతాగ్రాం వద్ద సొంతంగా యూనిట్ స్థాపించి..
అనంతపురం శివార్లలోని సేతు స్కూల్ సమీపంలోని సమతాగ్రాం దగ్గర ఒకటిన్నర ఎకరా సొంత పొలంలో సిమెంట్ తీర్లు తయారు చేసి ప్రైవేటుగా అమ్ముకోవడం దుమారం రేపుతోంది. రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తమ ఇళ్లు, కార్యాలయాల చుట్టూ కంచె ఏర్పాటుకు అవసరమైన ఫెన్సింగ్ ఫోళ్లను తయారు చేసి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. అందుకు నిర్మితి కేంద్రంలో పని చేసే కార్మికులు, నైట్ వాచ్ మెన్ ను కూడా వాడుకుంటున్నట్లు సమాచారం. ఆ విధంగా ఇప్పటికే కొన్ని కోట్లు సంపాదించి స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఉన్నతాధికారిణి మెతక వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..
గృహ నిర్మాణ శాఖ పీడీ శైలజ సౌమ్యురాలుగా గుర్తింపు పొందారు. ఆమె మంచితనాన్ని సదరు డివిజనల్ అధికారి తన నటనతో ఆమె వద్ద వినయం నటిస్తూ.. శాఖలో అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నట్లు సొంత శాఖ ఉద్యోగులే తెలిపారు. తనకు గిట్టని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయించడం నుంచి ఏ ఒక్క అంశాన్ని వదలకుండా క్యాష్ చేసుకుంటున్నట్లు ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగాన్ని గాలికొదిలి.. సొంత వ్యాపారంలో తలమునకలైన సదరు డివిజనల్ అధికారి హౌసింగ్ డిపార్ట్మెంట్ లో బాగా ఎదిగాడని కూడా అంటున్నారు. రిటైర్డ్ అయితే ఎలాగూ పింఛన్ ఉండదు కదా అంటూనే అడ్డంగా దోపిడీ చేస్తున్నట్లు సమాచారం, కనీసం అబ్దిదారులకు సిమెంట్ లు గానీ, తీర్లు గానీ సరఫరా చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావంతో అనంతపురం పరిసర మండలాల్లో గృహ నిర్మాణాలు ముందుకు సాగడం లేదని, టార్గెట్ కోసం రాష్ట్ర స్థాయి అధికారులు పెడుతున్న ఒత్తిడిని తాము భరించలేకపోతున్నామని, అయితే డివిజనల్ అధికారి మాత్రం తనకేం సంబంధం లేనట్లు ఉంటున్నట్లు మండిపడుతున్నారు. తాను చేయాల్సిన పనిని కూడా చివరకు కింది స్థాయి సిబ్బందిపై నెట్టేసి..సొంత వ్యాపారం మీద బయట బిజీబిజీగా తిరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొత్త కలెక్టరైనా చొరవ చూపాలి
జిల్లాకు వచ్చిన కొత్త కలెక్టర్ ఆనంద్ ఇప్పటికే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. పని మానేసి, సొంత వ్యాపారాల్లో తన మునకలైన ఇటువంటి అధికారులను గుర్తించి, వారిని దారిలో పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, ఎటువంటి ఆర్ధిక ప్రయోజనాలు అందకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.








