
వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పనుల్లో శ్రామికులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
– డ్వామా పథక సంచాలకులు సి.వి. శ్రీనివాస ప్రసాద్
బుచ్చినాయుడు కండ్రిగ మండలం, మార్చి 17: అనంత జనశక్తి న్యూస్
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న శ్రామికులకు నీడ, త్రాగునీరు, ప్రధమ చికిత్స పెట్టె వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని డ్వామా పథక సంచాలకులు సి.వి. శ్రీనివాస ప్రసాద్ అధికారులను ఆదేశించారు.మండలంలోని పల్లమాల గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను ఆయన పరిశీలించారు. వర్షపు నీటిని సమర్థంగా వడిసి పట్టి చెరువులను నింపే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. శ్రామికులతో మాట్లాడిన ఆయన, పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 మంది శ్రామికులు ఒక గ్రూప్‌గా ఏర్పడి బాధ్యతలను పంచుకుని పనిచేయాలని వివరించారు.పనుల విభజనలో భాగంగా 3 మంది గడ్డపార పని, 3 మంది మట్టిని బుట్టల్లో నింపడం, 4 మంది మట్టి మోసే పనులు చేపట్టి కాలువ పూడిక తొలగించి సెక్షన్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. రోజువారీ కొలతల ఆధారంగా పని చేస్తే రోజుకు రూ.307 వేతనం, వారానికి రూ.1842, 100 రోజులకు రూ.30,700 వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. దీని ద్వారా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు.
వేడి నుంచి రక్షణకు పనివేళల్లో మార్పు
వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని శ్రామికులు ఉదయం 6 గంటలకల్లా పనులు ప్రారంభించి, ఉదయం 11 గంటలలోపు పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. దీంతో ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
ఫార్మ్ పాండ్ల త్రవ్వకాలకు ప్రోత్సాహం
మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 ఫార్మ్ పాండ్లు త్రవ్వించేందుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటి సంరక్షణకు ఇవి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఎన్.ఎం.యం.ఎస్ హాజరులో పారదర్శకత
శ్రామికుల హాజరు నమోదులో 100 శాతం పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల ప్రకారం ప్రతి రోజు శ్రామికుల ఫొటోలను వివిధ స్థాయిల్లో అధికారులు పరిశీలిస్తారని, ఎలాంటి తప్పిదాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
పండ్ల, పూల తోటలకు ప్రోత్సాహం
ఉపాధి హామీ పథకం ద్వారా నిమ్మ, జీడి మామిడి, మామిడి, బత్తాయి, జామ, సపోటా, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, చింత, డ్రాగన్ ఫ్రూట్, గులాబీ, మల్లె, మునగ వంటి పండ్ల మరియు పూల తోటలను రైతులు అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద మూడు సంవత్సరాల పాటు సాగు ఖర్చులు, ఎరువులు, సంరక్షణ ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కార్యక్రమాధికారులు డి. చంద్రశేఖర్ రాజు, ఏ. దేవరి, టెక్నికల్ అసిస్టెంట్ మధుసూదన్, మేట్ రవి, ఉపాధి హామీ సిబ్బంది మరియు శ్రామికులు పాల్గొన్నారు.








