మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చిన హోంగార్డు

మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చిన హోంగార్డు

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన.. వీడియో వైరల్
హోంగార్డును ఉద్యోగం నుంచి తొలగించిన సైబరాబాద్ సీపీ

మియాపూర్ సెప్టెంబర్ 19, అనంత జనశక్తి న్యూస్ 

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన హోంగార్డుపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. హోంగార్డు ఆనంద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ తెలిపారు.వికారాబాద్ జిల్లా పరిగి మండలం గోవిందాపూర్‌కు చెందిన కడిగ ఆనంద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద స్థానికంగా ఉంటున్న ఓ మహిళతో గురువారం రాత్రి గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ సదరు మహిళను జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్‌ను అరెస్టు చేశారు. అనంతరం రైల్వే పోలీసులు అతడిని పోలీసు శాఖకు తిరిగి పంపించారు. హోంగార్డుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

డీజీపీ సీరియస్

మహిళను హోంగార్డు జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. హోంగార్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా ప్రవర్తన పోలీసు శిక్షణ, నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.