
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..
మిడ్జిల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం
హైదరాబాద్ జూలై 05, అనంత జనశక్తి న్యూస్
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాడానని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేశానని పేర్కొన్నారు.మిడ్జిల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలాన్ని దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.తన రాజకీయ జీవితానికి మిడ్జిల్ ప్రజలే పునాది వేసారని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఒకప్పుడు కరవుతో అల్లాడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన మండలంగా మార్చడం తన బాధ్యత అని అన్నారు. మిడ్జిల్ ఇకపై డార్క్ ఏరియా కాదు, వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.2006లో మిడ్జిల్ ప్రజలు తీసుకున్న నిర్ణయమే తనను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేర్చిందని గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి, ఆ రుణం తీర్చుకోవడం కోసం మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.అలాగే, 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, వందేళ్లుగా జరగని వెనుకబడిన తరగతుల కులగణన చేపట్టి వారికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదని పేర్కొన్న ముఖ్యమంత్రి, గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారమైతేనే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, మిడ్జిల్ మండలానికి ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు.







