గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తా

పెదపెంకి గ్రామ ఫైలేరియా సమస్యకు సమష్టి కృషితో చెక్

గ్రామంలో అన్ని వర్గాలను ఒప్పించి, మెప్పించిన తీరు ప్రశంసనీయం

రూ.6.18 కోట్లతో గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్లు

2018లో ఫైలేరియా సమస్య నా దృష్టికి వచ్చినపుడు ఆవేదన కలిగించింది

గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తా

పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

విజయవాడ జూన్ 08, అనంత జనశక్తి న్యూస్

“ఓ చిన్న గ్రామంలో నెలకొన్న సామాజిక అంతరాల వల్ల, యావత్ గ్రామమంతా భయానక ఫైలేరియా (బోద) వ్యాధి బారినపడిన వైనం 2018లోనే నా దృష్టికి వచ్చింది. గ్రామంలోని మురుగునీరు బయటకు పారకపోవడంతో అక్కడ ప్రమాదకర వ్యాధి వ్యాపించిందని తెలుసుకొని విస్తుపోయాను. అప్పట్లోనే దీనిపై మాట్లాడాను. అయితే అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మీద ప్రత్యేక దృష్టి సారించడంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే మార్గాలని కనుగొన్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. యంత్రాంగం సమష్టిగా పని చేస్తే ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను అయినా సానుకూలంగా, సావధానంగా ఎలా పరిష్కరించవచ్చో పార్వతీపురం మన్యం జిల్లా, పెదపెంకి గ్రామంలో చేపట్టిన సమగ్ర అభివృద్ధి ద్వారా నిరూపించామని చెప్పారు. గ్రామం మొత్తం మీద 197 ఫైలేరియా (బోద) కేసులు నమోదై, జాతీయస్థాయికి వెళ్లిన సమస్యను ఓ ప్రణాళిక ప్రకారం యంత్రాంగం అధిగమించిన విధానం సర్వదా అభినందనీయమన్నారు. మొదట అభివృద్ధిని వ్యతిరేకించిన గ్రామస్థులే ఇప్పుడు ఫలితాలను చూసి ప్రభుత్వాన్ని, అధికారులను మెచ్చుకోవడం సాధారణ విషయం కాదు అన్నారు. మన్యం జిల్లా, పెదపెంకిలో భారీగా నమోదు అయిన ఫైలేరియా కేసులు, కూటమి ప్రభుత్వంలో ఆ గ్రామంపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ, సాగుతున్న పనులపై జిల్లా అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘సామాజిక అంతరాల వల్ల పెదపెంకి గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లోని మురుగు నీరు బయటకు వెళ్లకుండా ఒకే దగ్గర నిల్వ ఉండిపోయింది. ఫలితంగా క్యూలెక్స్ దోమలు అధికమై గ్రామంలోని వారంతా వ్యాధి బారినపడ్డారు. మురుగు నీరు ఒకే దగ్గర ఉండిపోవడంతో దోమలు పెరిగాయి. ఫలితంగా ఎక్కడా లేనట్లుగా ఒకే ఊరిలో అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆరోగ్య హెచ్చరిక అయింది.

గ్రామంలో జనాభా క్రమంగా తగ్గింది

మన్యం జిల్లాలో కీలకమైన ఈ గ్రామ జనాభా ఒకప్పుడు 7,900 ఉండేది. అయితే ఫైలేరియా కేసులు అధికంగా నమోదు కావడం, వ్యాధి ప్రబలడం వల్ల గ్రామంలో పదేళ్లలో జనాభా 12 శాతం తగ్గింది. చాలామంది వ్యాధులకు బయటపడి వలస వెళ్లిపోయారు. అధికారంలోకి రాగానే ఏజెన్సీ గ్రామం అయిన పెదపెంకి మీద ప్రధానంగా ఫోకస్ చేశాము. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి కారణాలను తెలుసుకునే పని మొదలుపెట్టాం. గ్రామంలో విభిన్న వర్గాల మధ్య ఉన్న కొన్ని అంతరాల వల్ల వాడుకునే మురుగు నీటిని కూడా బయటకు కూడా పంపలేని విభేదాలు ఉన్నట్లు తేలింది. దీంతో గ్రామ సమగ్రాభివృద్ధి మీద దృష్టి సారించాం. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి డ్రైయిన్ల ఆక్రమణలు తొలగించాం. అందరితో కలిసి కూర్చొని మాట్లాడి నరేగా నిధులు రూ.6.18 కోట్లతో మేజిక్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మురుగు నీరు ఇంకిపోయేలా మ్యాజిక్ డ్రైన్లు, వర్షపు నీరు నిలిచిపోకుండా సీసీ రోడ్లు వేయించాం. దీంతో నీరు ఎక్కడ నిలవకుండా పారుదల సౌకర్యం ఏర్పడింది. మురుగుపోయిందని, డ్రైనేజీ కంపు లేకుండా చేశారని క్రమంగా గ్రామస్థుల నుంచి అనుకూలత వచ్చింది. ఫలితంగా కేసుల తీవ్రత తగ్గింది. దీనికి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలిగింది.

విభిన్న రకాల దోమలకు నిలయం అయింది

పెదపెంకి గ్రామాన్ని జిల్లా యంత్రాంగం సమగ్రంగా జల్లెడ పట్టినపుడు చాలా చోట్ల డ్రైనేజీ ఆక్రమణలు, డ్రైనేజీలకు సరైన ముగింపు లేకపోవడం, దారి మళ్లింపు వంటి అంశాలు బయటపడ్డాయి. ప్రతి చోట మురుగునీరు పారేందుకు వీలు లేని పరిస్థితి గమనించారు. దీంతో క్యూలెక్స్ లార్వా, ఎనాఫిలిస్ లార్వా భారీగా మురుగునీటిలో పేరుకుపోవడం గుర్తించారు. ఫైలేరియాతోపాటు చికన్ గన్యా, డెంగీ వ్యాధులు రావడానికి కారణం అయ్యే దోమల లార్వాలు మురుగులో అధికంగా కనిపించాయి. గ్రామంలోని మురుగునీటిలో అధికంగా దోమలు ఉండటంతో గ్రామస్థులపై పదేపదే దాడి చేసి కుట్టడం వల్లనే ఈ బోద వ్యాధి గ్రామంలో బాగా ప్రబలింది. ఈ విషయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ, ఆక్రమణలు తొలగిస్తూ, మురుగు కాల్వలను పటిష్టంగా నిర్మిస్తూ ఓ క్రమపద్దతిలో జిల్లా యంత్రాంగం ముందుకు కదలిన తీరు అభినందనీయం. సమష్టిగా గ్రామస్థులను ఒప్పించి గ్రామంలో మురుగునీరు లేకుండా డ్రైన్లను నిర్మించడంతో దుర్వాసన రాకుండా, రోగాలు లేకుండా చేయగలిగాం. 20 మేజిక్ డ్రైన్ల నిర్మాణం ద్వారా గ్రామంలో ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణం కనిపిస్తోంది. సమస్య కూడా పూర్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాను. త్వరలో గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తాను. జిల్లా కలెక్టర్  ప్రభాకరరెడ్డి కి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.