విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నాం.. ఇంకా మోసపోతామా..?

విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నాం.. ఇంకా మోసపోతామా..?

స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడులో మన డబ్బులు-మన లెక్కలు కార్యక్రమం

636 సంఘాలలోని 3820 మందికి రూ.32.48కోట్ల రుణాలు అందజేత

మహిళలే కుటుంబాలకు ఆధారంగా మారారు.. ఇంట్లో భర్తల సహకారం కచ్చితంగా ఉండాలన్న సునీత

రాప్తాడు డిసెంబర్ 02 అనంత జనశక్తి న్యూస్

ఆటోల దగ్గర నుంచి విమానాలు నడిపే వరకు మహిళలు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారని ఇలాంటి సమయంలో మనం మోసపోకూడదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో మన డబ్బులు – మన లెక్కలు సమావేశాన్ని నిర్వహించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు వివిధ పథకాల కింద వచ్చిన రుణాలకు సంబంధించి మెగా చెక్కును అందజేశారు. రాప్తాడు మండల వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, డీఆర్డీఏ అధికారులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జండర్ రిసోర్స్ సెంటర్ ని ప్రారంభించారు. మండలంలో ఉన్న 639 సంఘాలకు గాను 3858 సభ్యులకు 32కోట్ల 47లక్షల 50వేల రూపాయలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా జెండర్ కౌన్సిలింగ్ సెంటర్, మైక్రో ఎంటర్ప్రెనూర్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఇంతమంది మహిళలు ఇలా బయటకు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే దానికి మొదట బీజం వేసింది ఆనాడు ఎన్టీఆర్, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. ఒకప్పుడు మహిళా సంఘాలను చూసి చాలామంది నవ్వుకున్నారని… ఎగతాళి కూడా చేశారన్నారు. కానీ ఈరోజు వారే కుటుంబానికి ప్రధాన ఆధారంగా మారుతున్నారన్నారు. ఇంటి పట్టాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి జరిగినా… అది మహిళల పేరు మీదనే ఉంటుందన్నారు. దీనికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు మొదటి రోజుతో పోల్చుకుంటే ఈరోజు వరకు ఎంతో ప్రగతి సాధించారన్నారు. అయితే వారికి ఇంత పరిజ్ఞానం ఉన్నా… చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వచ్చిన రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే కొందరు తమ స్వార్థానికి వాడుకుని మోసం చేస్తున్నారన్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో 36 లక్షలు, ఆకుతోటపల్లిలో 32 లక్షల రూపాయలు బ్యాంకులకు చెల్లించకుండా మోసం చేశారన్నారు. వీటిపై కేసులు పెట్టి విచారణ చేస్తే పురుగుల మందు తాగి చస్తామంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను మోసం చేసేవారు ఎవరు బాగుపడరని ఎమ్మెల్యే సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ యాప్ ద్వారా ఎవరు మోసపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. దీనిపై స్వయం సహాయక సంఘాలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సభ్యులు ఎవరు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత యానిమేటర్లు, గ్రూపు లీడర్ల మీద ఉందన్నారు. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలు చెల్లించాలని సూచించారు. ఒకప్పుడు వేలల్లో తీసుకునే రుణాలు ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరాయని… ఈ ఘనత మీకు మాత్రమే దక్కుతుందన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం లేకుండా మనం ఏది సాధించలేమన్నారు. మహిళలు మహారాణులు కావచ్చు కానీ.. భర్తల సహకారం కచ్చితంగా ఉండాలన్నారు. వారి సహకారం ఉంటేనే మనం ఏ రంగంలో అయినా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే సునీత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి మహిళల కోసమే తీసుకొచ్చిందని ఎమ్మెల్యే సునీత గుర్తు చేశారు. మీకు జరుగుతున్న జరుగుతున్న మంచిని 10 మందికి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం రాప్తాడులో నూతనంగా నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే సునీత పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుని అక్కడున్న కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా క్యాంటీన్ నిర్మాణం పూర్తయిందని ఇక ప్రారంభోత్సవం త్వరలో ఉంటుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు..