
భూమిపై దర్శనమిచ్చిన దివ్యస్వరూపం సత్యసాయి
పుట్టపర్తి నవంబర్ 19 , అనంత జనశక్తి న్యూస్
సేవ, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవతాకు చూపిన మార్గం మహోన్నతమని పలువురు వక్తలు భావోద్వేగంగా పేర్కొన్నారు. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి నమ్మకం, ఆచరణ అని వారు గుర్తుచేశారు.సత్యసాయి బోధనల్లోని “మానవసేవే మాధవసేవ” సూత్రాన్ని ఆయన తన జీవితాంతం ఆచరించిన విధంగా ప్రజల మనసుల్లో దృఢమైన ముద్ర వేశారని వక్తలు వివరించారు. ప్రపంచమంతటా ప్రేమను పంచిన సత్యసాయి ప్రభావం విదేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుందని, ఎన్నో దేశాల్లో సాయిబాబా పేరు గౌరవంగా పలికిస్తారని వారు తెలిపారు.సత్యసాయి ఆశీస్సులతో పెద్ద స్థాయి సేవా కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని, ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టులు లక్షలాది జీవితాలను మార్చేశాయని ప్రసంగకులు అభిప్రాయపడ్డారు. 30 లక్షల మందికి, 1,600 గ్రామాలకు తాగునీరు అందించిన ఈ ప్రాజెక్టులు ప్రభుత్వాలకు సైతం ఆదర్శంగా నిలిచాయని వారు గుర్తుచేశారు.అదేవిధంగా 102 విద్యాసంస్థలు, అనేక ఆధునిక వైద్యాలయాలు, దేశ–విదేశాల్లో సేవలను విస్తరించిన సత్యసాయి ట్రస్ట్ కార్యకలాపాలు మానవతా విలువలను పెంపొందిస్తున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం 140 దేశాల్లోని 200 కేంద్రాల ద్వారా, 7 లక్షల వాలంటీర్లతో సత్యసాయి సేవామార్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని పేర్కొన్నారు.సత్యసాయి ప్రేమ సిద్ధాంతం సమాజాన్ని మార్గనిర్దేశం చేయగల శక్తి ఉన్నదని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని అధికారులు మరియు సేవా సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.సత్యసాయిబాబా శతజయంత్యుత్సవాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని, ఈ సందర్భంగా వక్తలు ధృవీకరించారు.
శతజయంత్యుత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సత్యసాయి సేవా మార్గం సమాజానికి శాశ్వత స్ఫూర్తి అని అన్నారు. సత్యసాయి శతజయంత్యుత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు తెలిపారు. సత్యసాయి చూపిన ప్రేమ–సేవా మార్గం భవిష్యత్తు తరాలకు దారిదీపమవుతుందన్నారు.








