నెల్లూరు సండే మార్కెట్ సమస్యకు శాశ్విత పరిష్కారానికి ప్రణాళికలు

నెల్లూరు సండే మార్కెట్ సమస్యకు శాశ్విత పరిష్కారానికి ప్రణాళికలు

సండే మార్కెట్ ను పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ

వర్షాల సమయంలో నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సండే మార్కెట్ వ్యాపారస్తులు

సండే మార్కెట్ రోడ్డు ఎత్తు పెంచే పనులు సోమవారం నుంచి ప్రారంభం

అభివృద్ధికి ఆక్రమణదారులు సహకరించాలి

డ్రైన్లు పూడిపోవడమే వర్షపు నీటి నిల్వకు కారణం

రూ.165 కోట్లతో తిరిగి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

నెల్లూరు నవంబర్ 16 అనంత జనశక్తి న్యూస్

నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. వీధి వీధి తిరిగి రోడ్ల స్థితిని, డ్రైన్ల పరిస్థితిని తనిఖీ చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.దుకాణదారుల సమస్యలను ఆరా తీశారు. డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ వర్షాలు వస్తే నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో నీళ్లు నిలబడుతున్నాయన్న సమస్య ఉందన్నారు. దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక్కడ డ్రైన్స్ మూసుకు పోవటమే ప్రధాన కారణమని స్థానిక టీడీపీ నేతలు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకే పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం డ్రైన్లపై ఆక్రమణల వల్లే ఇబ్బందికర పరిస్థితి ఉందని గుర్తించామని చెప్పారు. ఉయ్యాల, రామిరెడ్డి, మల్లప్ప, గచ్చు కెనాల్స్ బ్రాంచ్ కాలువలను వెడల్పు చేయాలన్నారు. ఇందుకోసం కాలువలపై ఆక్రమణలు తొలగించాల్సి ఉందన్నారు. కాలవల వద్ద ఆక్రమణదారులు సహకరించాలని సూచించారు. ఆక్రమణదారుల్లో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టమని మంత్రి భరోసా ఇచ్చారు. అలా ఆక్రమణదారులు సహకరించకుంటే రానున్న రోజుల్లో నెల్లూరు సిటీకి ముంపు ప్రమాదం తప్పదన్నారు. సమస్య శాశ్వతపరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులు సోమవారం నుంచే ప్రారంభిస్తామన్నారు. సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వద్ద ఉన్న డ్రైన్ల మరమ్మత్తులు కూడా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిలిపేసిందని మండిపడ్డారు. రూ.165 కోట్లతో తిరిగి వాటిని ప్రారంభించామన్నారు. నెల్లూరును దోమలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,44 డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్, 46వ డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్ర..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు