డాక్టర్ సేవా కుమార్ ను అభినందిస్తున్న నిమ్మరాజు

జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడంలో ఐఎంఏ గుంటూరు శాఖ ఆదర్శంగా నిలవాలి
— సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు వినతి.

గుంటూరు,నవంబర్ 13. అనంత జనశక్తి న్యూస్.

స్వాతంత్రానికి ముందు 1928లో స్థాపితమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఏపీ శాఖకు అనుబంధంగా 150 కి పైగా ఆసుపత్రులు, 1600 మందికి పైగా వైద్యులతో నిరంతరాయంగా ప్రజలకు వైద్య, ఆరోగ్య చైతన్యం అందించడంలో గుంటూరు శాఖ ముందుందని సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు కొనియాడారు. నిరంతరం ప్రజల సమస్యలు, హక్కుల కోసం నిలిచే జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడంలో కూడా ఆదర్శంగా నిలవాలని నిమ్మరాజు కోరారు.ఇటీవల ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ సేవా కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. 1987లో వైద్య కళాశాలలో చేరినప్పటి నుంచి డాక్టర్ సేవా కుమార్ తో తనకు గల సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పత్రికల్లో వ్యాసాలు తదితర పద్ధతుల్లో ప్రజారోగ్యంపై అవిరళ కృషి చేస్తున్న సేవా కుమార్ 1996లో సామాన్య ప్రజల కోసం సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్ హెచ్ ఓ) ను స్థాపించి తద్వారా విశేష సేవలంది స్తున్నారని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు కన్సల్టేషన్ ఫీజు తో ప్రమేయం లేకుండా తక్కువ చార్జీలతో కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండటాన్ని ప్రస్తావిస్తూ నిమ్మరాజు అభినందించారు. అవసరమైతే మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కూడా సిద్ధమేనన్న సేవా కుమార్ సేవాభావాన్ని ఆయన ప్రశంసించారు. ఐఎంఏ అధ్యక్షుని హోదాలో నగరంలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా ఉచిత కన్సల్టేషన్, రాయితీతో కూడిన వైద్య పరీక్షలు జర్నలిస్టులకు అందించేలా కృషి చేయాలని నిమ్మరాజు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సేవా కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వహణ రానురాను భారంగా మారుతోందని, రకరకాల పన్నులు ప్రత్యేకించి కమర్షియల్ విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను, ఎక్విప్మెంట్ పై భారీ పన్నులు, సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపెడౌతున్నాయని, అయినప్పటికీ జర్నలిస్టులకు మరింత వైద్య సేవలు అందించేందుకు తప్పనిసరిగా కృషి చేస్తానని అన్నారు.