అనంతలో ఆడ శిశువు ఆక్రందనలు

అనంతలో ఆడ శిశువు ఆక్రందనలు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును కవర్ లో చుట్టి రోడ్డు పక్కన వదిలేసిన దుర్మార్గం

తెలతెలవారుతుండగా వినిపించిన శిశువు కేకలు

తక్షణం రంగంలోకి దిగిన ఐసీడీఎస్ పీడీ నాగమణి, మహిళా పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు

అక్కున చేర్చుకున్న అధికారుల బృందం

ప్రభుత్వాస్పత్రికి తరలింపు

జీజీహెచ్ డిప్యూటీ ఆర్.ఎం.ఓ డాక్టర్ గుజ్జల హేమలత ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్స

తెలతెల వారుతుండగా వినిపించిన ఆడ శిశువు కేకలతో అనంతపురం ఉలిక్కిపడింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఎవరో ఓ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన వదిలివెళ్లారు. అంతలోనే శిశువు కేకలతో చుట్టుపక్కల ఇళ్ల వారు అప్రమత్తమయ్యారు. అక్కడి దృశ్యాలు చూసి చలించిపోయారు. అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు క్షణాల్లో అక్కడికి చేరుకొని శిశువును అక్కున చేర్చుకున్నారు.

అనంతపురం, సెప్టెంబర్ 25: అనంత జనశక్తి న్యూస్

అనంతపురం సాయినగర్ 7వ క్రాస్ లో గురువారం తెల్లవారుజామున నవజాత శిశువు(ఆడబిడ్డ)ను పాలిథిన్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కగా వదిలి వెళ్ళడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. శిశువు కేకలు విని చుట్టు పక్కల ఇళ్ల వారు నిద్రలేచి అందరికీ సమాచారం ఇచ్చారు.

తక్షణం రంగంలోకి అధికారులు

ఈ విషయం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. వెంటనే 3వ సచివాలయం మహిళా పోలీస్ టీఎం సుస్మిత, అంగన్వాడీ కార్యకర్త అరుణ, ఏ.ఎన్.ఎం లక్ష్మీ ఎక్కడికి చేరుకున్నారు. ఐసీడీఎస్ పీడీ మల్లెపోగు నాగమణి, డీసీపీఓ మంజునాథ్, టూ టౌన్ ఎస్.ఐ రుష్యేంద్ర, ఎస్.ఐ చైల్డ్ లైన్ సురేష్ తదితరులు రంగంలోకి దిగారు. శిశువును పరిశీలించారు.

పెద్దాసుపత్రి తరలింపు

బొడ్డూడని.. కళ్లు కూడా తెరవని నవజాత శిశువును అధికారుల బృందం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు.

డిప్యూటీ ఆర్.ఎం.ఓ డాక్టర్ గుజ్జల హేమలత చొరవతో మెరుగైన వైద్యం

ఉదయం ఎనిమిది గంటలకల్లా సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ ఆర్.ఎం.ఓ డాక్టర్ గుజ్జల హేమలత ఆస్పత్రికి చేరుకున్నారు. తనే స్వయంగా శిశువును పరీక్షించారు. వైద్యులతోనూ మరోసారి అన్ని రకాలుగా పరీక్షించారు. శిశువుకు అంటిన రక్తపు మరకలను శుభ్రం చేయించారు. నవజాత శిశు కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి శిశువు ఆరోగ్యంగానే ఉందని, అయినా 72 గంటలు తమ పరిశీలనలోనే ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఆ తరువాత ఆస్పత్రిలోని అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ న్యూట్రిషన్ బోయ సాయిపల్లవి, కౌన్సిలర్ డా.రాధ, స్టాఫ్ నర్స్ బళ్లారి సుకన్య, ఇతర సిబ్బందితో మాట్లాడి..శిశువుకు కావలసిన పాలను అందించాలని సూచించారు. 72 గంటల తరువాత శిశువును ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశు గృహకు తరలించినా అవసరమైన పాలు ఇక్కడి నుంచే అందిస్తామని డిప్యూటీ ఆర్.ఎం.ఓ డాక్టర్ హేమలత ఐసీడీఎస్ పీడీ నాగమణికి సూచించారు.

ఎవరిదీ పాపం

అప్పుడే పుట్టి..కనీసం రక్తపు మరకలు కూడా ఆరని..బొడ్డుని.. కళ్ళు కూడా తెరవని శిశువును వదిలిపెట్టేకి వారికి మనస్సు ఎలా వచ్చిందోనని అందరూ శాపనార్థాలు పెట్టారు. అసలు కారకులు ఎవరో గుర్తించాలని, ఘటనకు దారి తీసిన పరిస్థితులు తెలుసుకోవాలని కూడా అధికారులను పలువురు కోరారు. కారణాలు ఏమైనా శిశువును చంపకుండా..కనీసం ప్రాణంతోనైనా వదిలి పెట్టినందుకు వారికి రెండు చేతులతో మొక్కాలని పలువురు పేర్కొన్నారు. సకాలంలో స్పందించిన మహిళా పోలీస్ సుస్మిత, అంగన్వాడీ వర్కర్ అరుణ, ఆరోగ్య కార్యకర్త లక్ష్మీ సహా అధికారులందరికీ స్థానికులు అభినందించారు.