శ్రీవారి పాదాలు”

“శ్రీవారి పాదాలు” (‘శ్రీ పాదాలు’)

 

పురాణాల ప్రకారం, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుండి భూలోకానికి దిగివచ్చినప్పుడు, మొట్టమొదటగా తన పాదాలను మోపిన ప్రదేశం ఇదేనని భక్తుల నమ్మకం. శ్రీవారి పాదాలు తిరుమల కొండల్లోని ఎత్తైన శిఖరాలలో ఒకటైన నారాయణగిరి పర్వతంపై ఉంది. ఇది ప్రధాన ఆలయానికి సుమారు 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఒక రాతి శిల మీద స్వామి వారి రెండు పాదాల గుర్తులు ఉంటాయి. భక్తులు ఈ పాదాలను దర్శించుకుని, నమస్కరించుకుంటారు. పాదాల చుట్టూ రక్షణగా ఒక గాజు గదిని నిర్మించారు. భక్తులు ఆ గాజు గుండా పాదాలను దర్శించుకోవచ్చు. గతంలో ఇలా గాజు రక్షణ ఉండేది కాదు కొంతమంది భక్తుల అత్యుత్సాహం వల్ల ఆ పాదాల పై కొబ్బరికాయలు కొట్టడంతో కొంత భాగం దెబ్బతిన్నది.. కొత్తగా పాదాలు ఏర్పాటు చేసే సమయంలో ఒక విశేషం జరిగినట్లు భక్తులు మరియు స్థానికులు చెప్పుకుంటారు. నీటి ఊట”శ్రీవారి పాదాల పునరుద్ధరణ పనుల సమయంలో అక్కడ నీటి ఊట బయటపడిందనే వార్త అప్పట్లో బాగా ప్రచారమైంది. నారాయణగిరి శిఖరం తిరుమల కొండల్లోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. సాధారణంగా అంత ఎత్తున, రాతి కొండపై నీటి ఊట రావడం చాలా అరుదు. పనులు జరుగుతున్న సమయంలో పాదాల కింద నుండి స్వచ్ఛమైన నీరు రావడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఇది స్వామి వారి మహిమేనని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీవారి పాదాల కింద ‘ముక్కోటి తీర్థాలు’ ప్రవహిస్తాయని చెబుతారు. శ్రీ మహావిష్ణువు పాదం మోపిన చోట గంగ ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే అక్కడ నీటి ఊట రావడం పట్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యత పెరిగింది. అయితే, కొండల్లోని రాతి పొరల మధ్య ఉన్న నీరు పనుల కోసం తవ్వినప్పుడు బయటకు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తారు. అయినప్పటికీ, ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో, అంత ఎత్తైన కొండపై నీరు కనిపించడం భక్తులకు మాత్రం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది.ఇక్కడి నుండి తిరుమల పట్టణం మరియు చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవుల అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దర్శనం వేగంగా అయ్యేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. SV మ్యూజియం ప్రక్కనే శారదాపీఠం ఉంటుంది దాని ప్రక్కన ఉన్న రోడ్డు నుండి వెళితే శ్రీవారి పాదాలకు చేరుకోవచ్చు.నారాయణగిరి శిఖరం గాలివానలకు, ఎండకు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. పురాతనమైన ఆ శిలా పాదాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతినకుండా ఉండటానికి మరియు వాటికి ఒక విశిష్టతను చేకూర్చడానికి టీటీడీ అక్కడ ఏర్పాటు చేసింది.