ఖరీదైన వైద్య సేవలు వద్దు... ఉచిత వైద్యమే ముద్దు...
నేలకోట గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
-మంత్రి సత్య కుమార్ ఆశీస్సులతో 225 మందికి ఆరోగ్య సేవలు
-నేలకోటలో వైదేహి హాస్పిటల్–సంస్కృతి సేవా సమితి సంయుక్త వైద్య శిబిరం.
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ కగ్గోలు హరీష్ బాబు.
శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3, అనంత జనశక్తి న్యూస్:
ధర్మవరం మండలం, నేలకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆశీస్సులతో, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో మరియు బెంగళూరు వైట్‌ఫీల్డ్ వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం బుధవారం విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయగా, మొత్తం 225 మంది—మహిళలు 110 మంది, పురుషులు 115 మంది—ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ నిపుణ వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, కీళ్ళు–ఎముకలు, కిడ్నీ, గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, ఇ.ఎన్.టి. తదితర విభాగాలకు చెందిన వైద్య సేవలు అందించడమే కాకుండా ఈసీజీ, ఎకో, బిపి, ఆర్ బి ఎస్ వంటి అనేక పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రజలకు అందించిన వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..... ఆరోగ్యం ప్రతి కుటుంబానికి మౌలిక హక్కు. వైద్య సేవలు ఖరీదవుతున్న ఈ కాలంలో పేదవారు చికిత్స భారాన్ని తెగనే భరించలేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పనిచేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను గ్రామాల్లోనే ఉచితంగా అందించడం ఈ సంస్కృతి సేవా సమితి యొక్క ప్రత్యేకత అని అన్నారు. పేదరికం, అవగాహన లోపం, చికిత్సకు అధిక వ్యయం వంటి సమస్యల వల్ల గ్రామీణ ప్రజలు అవసరమైన సమయంలో వైద్యం తీసుకోలేకపోతున్నారని, అటువంటి కుటుంబాలకు సేవలను వారి వద్దకే తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే నేలకోట గ్రామంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్కృతి సేవా సమితి మరియు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో సంయుక్యతతో పనిచేసి ప్రజలకు గొప్ప సేవ అందించారని అభినందించారు.అలాగే, ఈ శిబిరంలో చికిత్స అవసరమయ్యే రోగులకు డా.ఎన్.టి.ఆర్. ఆరోగ్యసేవ మరియు ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏ వై పథకాల ద్వారా పూర్తిగా ఉచిత శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని హరీష్ బాబు వివరించారు. గ్రామీణ ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి వైద్య శిబిరాలను మరిన్ని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గం ఆరోగ్య పరంగా మరింత బలోపేతంగా మారుతోందని హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సాంబశివమ్మ, ఎం.ఎల్.హెచ్ పి పుష్పలత, ఏఎన్ఎం హేమలత, ఆశా వర్కర్లు, వైదేహి హాస్పిటల్ లోకేష్ భరణి బృందం, సచివాలయ సిబ్బంది, బీజేపీ మండల అధ్యక్షులు చంద్ర, నేలకోట రాము, ఏలుకుంట్ల లక్ష్మీనారాయణ, పోతుకుంట రాజు, దర్శనముల ధనుంజయ, అదెప్ప, భక్తవత్సలా నాయుడు, నడిమిగడపల్లి నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.