సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తం.
పనిచేయని ఏసీలు.
అందుబాటులో లేని లిఫ్ట్.
పట్టించుకోని అధికారులు.
నిద్రావస్తాలో వైద్య అధికారులు.
అనంతపురం , అనంత జనశక్తి న్యూస్:
అనంతపురం నగర శివారులో గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేక ఇష్టరాజ్యంగా కొనసాగుతోంది. అయ్యో ఇదేమి విడ్డూరం అనే పరిస్థితి నెలకొంది. పట్టించుకోవాల్సిన అధికారులు నిద్ర వస్తాలో ఉండడంతో కనీసం వసతులు లేకుండా నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు అనే ప్రశ్న కేవలం ప్రశ్న గానే మిగిలిపోతుంది దీనికి సమాధానం చెప్పే అధికారులు కూడా కరువైన పరిస్థితి నెలకొంది.
అనంతపురం నగర శివారులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వసతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి కనీసం ఏసీలు కూడా పనిచేయని దౌర్భాగ్య పరిస్థితిలో ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతోంది. అంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని డబ్బాలు కొట్టుకున్న ప్రభుత్వ పనితీరు ప్రస్తుతం జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి భిన్నంగా మారిపోయింది. ప్రతివారం 12 వరకు ఆపరేషన్లను చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో కొనసాగుతోంది. ఆపరేషన్ థియేటర్లో కనీస వసతులు లేకపోవడంతో అక్కడ ఆపరేషన్లను పూర్తిగా నిలిపివేశారు. అధికారులకు తెలియజేసిన వారు పట్టించుకోవడం లేదంటూ అక్కడ ఉన్న సిబ్బంది వైద్యులు వాపోతున్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం దానిని అలా కొనసాగించేస్తున్నారు.
పర్యవేక్షణ లోపం
ప్రభుత్వ వైద్యశాలలు ఆసుపత్రులు అధికారుల పర్యవేక్షణతోనే పూర్తిస్థాయిలో సక్రమంగా కొనసాగుతాయి ఇక్కడ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహారం కొనసాగుతోంది పర్యవేక్షణ లేకపోవడంతో అడిగే వారు లేక ఎటు చూసినా నిర్లక్ష్యం తాండవిస్తోంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అడిగే వారు లేకపోవడంతో అదే తంతు కొనసాగుతోంది. అధికార యంత్రాంగం పూర్తిగా కళ్ళు మూసుకుని వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారి కనీసం చుట్టపు చూపుగా కూడా రాకపోవడంతో అక్కడ వ్యవహారం అత్యంత లోపాయికారిగా కొనసాగుతోంది.
పర్యవేక్షించాల్సిన అధికారులు నిద్రావస్థలో
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించే అధికారులు అత్యంత దయనీయంగా దౌర్భాగ్యంగా విధులు నిర్వహిస్తుండడంతో అక్కడ పర్యవేక్షణ లోపం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ఆసుపత్రిని అందుబాటులోకి తేవాల్సిన అధికారులు కనీస వసతులు కూడా మృగ్యమవుతున్న నేపథ్యంలో వాటిని పట్టించుకోకుండా ఇష్టాను రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాపం తమది కాదంటూ ఎవరికి వారు చేతులు దులుపుకుంటున్నారు. నిధులు మిగిల్చి వాటిని దోచేయాలని కుంచిత బుద్ధితో ఇలాంటి వ్యవహారం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి విధులలో అలసత్వం కారణంగా అక్కడికి వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేవలం డబ్బాలు కొట్టుకునే కి తప్ప ప్రజలకు ఉపయోగకరంగా వ్యవహరించాల్సిన వారు కరువయ్యారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోండి అయ్యా
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి సంబంధిత అధికారులు మొద్దు నిద్రను వీడి ప్రత్యేక చొరవతో ఆసుపత్రిని గాడిలోకి తీసుకురావాలంటూ పలువురు ప్రజలు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రోగులు అక్కడికి వస్తున్న నేపథ్యంలో వారికి అన్ని వసుతులతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యతను ఉన్నతాధికారులు తీసుకోవాలని కోరుతున్నారు.