ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాల పై చర్చించిన సీఎం జగన్
రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని సీఎం విజ్ఞప్తి
పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలపై చర్చ
ఢిల్లీ పర్యాటనలో ఉన్న సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో దాదాపు 45 నిమిషాలసేపు సమావేశమైయ్యారు. ప్రధానితో సమావేశం అనంతరం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
పోలవరానికి నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపండి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని సీఎం ప్రధానికి తెలిపారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని సీఎం ప్రధానికి వివరించారు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఖర్చు చేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాల్సిందిగా విజ్ఙాప్తి చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రిని సీఎం కోరారు.
సుధీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించండి
2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయని సీఎం పీఎంకు తెలిపారు. ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల చెల్లింపులు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయని, ఏపీ జెన్కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ప్రధానమంత్రిని కోరారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని సీఎం మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసంగా 10 శాతం అధికంగా కవరేజీ ఉందని, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని పీఎంకు సీఎం వివరించారు. నీతిఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించిందని తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని ప్రదానమంత్రిని కోరారు. ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోందని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుందని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ప్రధానిని కోరారు.
పెండింగులో ఉన్న విభజన హామీల పై దృష్టి పెట్టండి
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయిని మరోసారి సీఎం ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక హోదా సహీ, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం విజ్ఞప్తి చేశారు.
కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్ధిక సహాయం చేయండి
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని, ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వెల్లడించారు. ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయాలని సీఎం కోరారు.
కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కు గనులను కేటాయించండి
వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చిందని, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరమని ముఖ్యమంత్రి పీఎంకు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సబ్సిడీ బకాయిలను మంజూరు చేయండి
ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానమంత్రిని సీఎం కోరారు. 2012-13 నుంచి 2017-18 వరకూ రూ. 1702.90 కోట్లు పెండిగులో ఉన్నాయని సీఎం తెలిపారు.