నన్ను గెలిపిస్తే ఎకరం పొలం… పన్నులు కూడా నేనే… ఖమ్మం సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో హాట్ టాపిక్
"అనంతజనశక్తి న్యూస్" AP & TG
తెలంగాణలో 2025 సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వేడెక్కుతోంది. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రాజకీయ జోష్ పెరిగింది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న మేనిఫెస్టోలు ప్రకటిస్తుండగా, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రావెళ్ల కృష్ణరావ్ ప్రకటించిన హామీలు ప్రాంతీయంగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.
గ్రామ అభివృద్ధి పేరుతో ఓటర్లకు వరాల జల్లులు కురిపించిన మేనిఫెస్టోలోని హామీలు ఓటర్లలో ఆసక్తి, రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీశాయి.
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
వీరన్న స్వామి ఆలయానికి 1 ఎకరం భూమి విరాళం
తన పదవీకాలం ఐదేళ్లపాటు గ్రామంలోని అన్ని ఇళ్ల ఇంటి పన్నులను పూర్తిగా భుజాన వేసుకోవడం
ఐదేళ్లు గ్రామంలోని నల్లా బిల్లులన్నీ తనవే అన్న భరోసా
ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు ఉచిత మందుల పంపిణీ
గ్రామంలోని ప్రతి దేవాలయానికి ఉత్సవాల నిమిత్తం రూ.50,000 సాయం
వినాయక చవితి సందర్భంగా అన్ని ఉత్సవ కమిటీలకు ఉచిత వినాయక విగ్రహాల అందజేత
ఈ హామీలు సాధ్యం అవుతాయా? అమలులోకి వస్తాయా? అనే ప్రశ్నలు ఓటర్లలో వినిపిస్తున్నప్పటికీ, స్థానిక రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. గ్రామ ఎన్నికల వాతావరణానికి ఈ హామీలు మరింత ఉత్సుకతను తెచ్చాయి.