మీర్జాగూడలో దారుణం –
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు మృతి
హైదరాబాద్ నవంబర్ 03 అనంత జనశక్తి న్యూస్
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో ఘటన స్థలంలోనే పలువురు ప్రయాణికులు మృతిచెందారు. మరికొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఢీ కొట్టిన వేగం అంత ఎక్కువగా ఉండడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.మృతుల్లో 15 నెలల చిన్నారి మరియు ఆమె తల్లి కూడా ఉండటం హృదయవిదారకంగా మారింది. రోడ్డుపై తల్లి, బిడ్డ మృతదేహాలు పడి ఉన్న దృశ్యం చూసి అక్కడి ప్రజలు కంటతడి పెట్టారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమైందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని రేపింది. స్థానికులు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించాలని కోరుతున్నారు.