వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు
కుట్రలతోనే చంద్రబాబును జైలుకు పంపారు
రాష్ట్ర భవిష్యత్తు గురించే చంద్రబాబు తపన
బాధిత కుటుంబాలను ఆదుకోవడం మా బాధ్యత
నందిగామ ‘నిజం గెలవాలి’ పర్యటనలో నారా భువనేశ్వరి
నందిగామ ఫిబ్రవరి 09,అనంత జనశక్తి న్యూస్
వచ్చే ఎన్నికల కురక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలో ఆమె శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో చందర్లపాడు మండలం, కోనాయపాలెంలో టీడీపీ కార్యకర్త వనపర్తి మళ్లిఖార్జునురావు మృతి చెందారు. మళ్లిఖార్జునురావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ…‘‘టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆదుకోవాలని జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనతో చెప్పారని భువనేశ్వరి అన్నారు. బిడ్డల్లాంటి కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు. ఇందులో భాగంగానే చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నానని వివరించారు. ఇప్పటిదాకా 90 కుటుంబాలను పరామర్శించానని తెలిపారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాస అంతా ప్రజలు, కార్యకర్తలేనని అన్నారు. నిరంతరం కార్యకర్తల గురించి పరితపిస్తుంటారని, చంద్రబాబును కార్యకర్తల నుండి ఏ శక్తీ వేరుచేయలేదన్నారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరువలేనిదన్నారు. తమ కుటుంబం కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని భువనేశ్వరి అన్నారు.