ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి –
ధర్మారెడ్డి టీటీడీ ఈవో
తిరుపతి మే 26,అనంత జనశక్తి న్యూస్
ఏ సంస్థ అభివృద్ధి చెందాలన్నా, నాణ్యతలో రాజీపడకుండా లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, గత మూడేళ్లలో ఎస్వీబీసీ ఈ ఘనత సాధించిందని టీటీడీ ఈవో, ఎస్వీ బీసీ
ఎం డి ఎవి ధర్మారెడ్డి అన్నారు.
శుక్రవారం ఎస్వీబీసీ కార్యాలయంలో ఎస్వీబీసీ ఉద్యోగులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్‌తో కలిసి ఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి ఈవో మాట్లాడుతూ, సిఈవో సమర్ధవంతంగా ఎస్వీబీసీ పరిపాలన, ఆర్థిక అంశాల్లోని లోపాలను అధిగమించారని చెప్పారు.ప్రతి ఉద్యోగి సంస్థను తమదిగా భావించి, దాని ప్రతిష్ట కోసం కృషి చేయాలని ధర్మారెడ్డి ఈవో కోరారు. “సుందరకాండ, భగవద్గీత, యోగ దర్శనం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎస్వీబీసీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ, పేరు, ప్రఖ్యాతులు లభించాయని చెప్పారు. గత మూడు సంవత్సరాల నుండి ఎస్వీబీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆధ్యాత్మిక చానళ్ళలో అగ్రస్థానంలో ఉందని అన్నారు . ఎస్వీ బీసీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నాయని తెలిపారు. అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించామని , అదే సమయంలో కార్యక్రమాల నాణ్యతలో రాజీపడకుండా అందరు సమిష్టి కృషితో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలి. మరింత మెరుగైన రీతిలో కార్యక్రమాల నాణ్యతను ఎలా పెంచాలి. ఇతర పరిపాలనాపరమైన అంశాలలో ఉద్యోగుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోవడానికి నెలవారీ సమావేశాలు నిర్వహించాలని ఈవో, సిఈవో కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ పరిపాలన, న్యూస్, ప్రొడక్షన్, సాంకేతిక, ఆర్థిక, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.