బుల్లితెర నటులతో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం
అనంతపురం జనవరి 31, అనంత జనశక్తి న్యూస్
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లాలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుల్లితెర నటులతో కలిసి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.స్థానిక క్లాక్‌టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుల్లితెర నటులు సుస్మిత, ప్రభాకర్, పవన్ సాయి, అనిల్, శ్రీరాం తదితరులు రోడ్డు భద్రత నిబంధనలకు సంబంధించిన ఫ్లకార్డులు చేతబట్టి ప్రదర్శనగా నడుచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్టు వినియోగించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. అందుకే డ్రంకన్ డ్రైవింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి శ్రీ అశ్విని మణిదీప్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది చట్టాల భయంతో మాత్రమే పాటించాల్సిన అంశం కాదని, ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని తెలిపారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.బుల్లితెర నటుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సీఐలు వెంకటేష్ నాయక్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, రాజేంద్రనాథ్ యాదవ్, జగదీష్, డిస్కవర్ అనంతపురం అనిల్, పలువురు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.