కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్.. బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారమంత తీవ్రంగా లేవు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.ఇంకా చెప్పాలంటే.. గత ఎన్నికల కన్నా ఎక్కువే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అత్యంత విశ్వసనీయమైన సంస్థల ఎగ్జిట్ పోల్స్ .. కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఏకపక్ష విజయాన్ని ప్రకటించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజార్టీ ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు 107- 119 సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీకి 90 వరకూ రావొచ్చని తెలిపింది. జీ న్యూస్ కాంగ్రెస్ కు 103 నుంచి 118 సీట్లు ఇచ్చింది. బీజేపీ మ్యాగ్జిమం 94 సీట్లు సాధించవచ్చని తెలిపింది. కర్ణాటకలో పేరు పొందిన న్యూస్ చానల్ సువర్ణ న్యూస్ బీజేపీకే ఎక్కువ సీట్లు ఇచ్చింది. 117 వరకూ సీట్లు రావొచ్చని అంచనా వేశారు. కాంగ్రెస్ ఖాతా 106 దాకా వస్తుందని చెబుతున్నారు. రిపబ్లిక్ టీవీ పంగ్ ఫలితాలను అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీలకు అటూ ఇటూగా సమాన సీట్లు వస్తాయని చెబుతున్నారు. టీవీ నైన్ – పోల్ స్టార్ట్ సంస్థ ఇచ్చిన ఎగ్టిట్ పోల్‌లో నూ హంగ్ సూచనలే వచ్చాయి. న్యుూస్ నేషన్ సంస్థ 114 సీట్లను బీజేపీకి ఇచ్చింది. ఇక విశ్వసనీయ సర్వే సంస్థగాపేరు తెచ్చుకున్న సీఓటర్ కాంగ్రెస్ కు మ్యాగ్జిమం 112 సీట్లే ఇచ్చింది. మెజార్టీకి కావాల్సినవి 113. అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పాతిక నుంచి ముఫ్పై సీట్లు గెలుస్తారని అంచనా వేస్తున్నారు. కుమారస్వామి కూడా అదే చెబుతున్నారు. తమ పార్టీకి పాతిక సీట్లకు మించి రావని చెబుతున్నారు. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఒక్కలిగలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడంతో.. స్థిరమైన ఓటు బ్యాంక్ ఆ పార్టీని దాటి పోవడం లేదు. దాంతో మరోసారి కింగ్ మేకర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీకి అవసరమైన 113 ఎమ్మెల్యే సీట్ల కంటే ఒక్క సీటు తక్కువగా వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. సర్వేల్లో కొన్ని పోల్స్ 140కిపైగా స్థానాలు ఇచ్చినా ఎగ్జిట్ పోల్స్ లో ఆ స్థాయి ఫలితాలు కనిపించలేదు. మొత్తానికి కర్ణాటక ఫలితాలు పోలింగ్ ముగిసినా అస్పష్టతగానే ఉన్నాయని అనుకోవచ్చు.