హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త వ్యూహం:
నౌకలపై 2 మిలియన్ డాలర్ల సుంకం?
ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకునే దిశగా ఇరాన్ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కీలక సముద్ర మార్గం గుండా వెళ్లే కొన్ని ట్యాంకర్లపై 2 మిలియన్ డాలర్ల వరకు సుంకం విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ భారీ రుసుము విధానం ద్వారా ఆ జలమార్గంపై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం ఇరాన్ వ్యూహాత్మక బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆ దేశానికి చెందిన ప్రజాప్రతినిధి అలాద్దీన్ బౌరోజెర్దీ ఒక టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్లు మీడియా వెల్లడించింది.హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్దశాతం సాగుతుండటంతో, ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంటే అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.